రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యంపై డీజీపీకి బీజేపీ ఫిర్యాదు

రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యంపై డీజీపీకి బీజేపీ ఫిర్యాదు
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న వరుస హింసాత్మక ఘటనలు శాంతిభద్రతలపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొంటూ, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆధ్వర్యంలో బీజేపీ నాయకుల బృందం రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేసింది.  వారు ప్రధానంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ, కామారెడ్డి పట్టణం, అలాగే నిజామాబాద్ జిల్లా రుద్రూర్ ప్రాంతాల్లో జరిగిన మూడు తీవ్రమైన సంఘటనలను ప్రస్తావిస్తూ, ఇవన్నీ రాష్ట్రంలో చట్టసువ్యవస్థ పూర్తిగా క్షీణించిందనే దానికి నిదర్శనమని బిజెపి పేర్కొంది.
ఈ మూడు ఘటనలపై ఎలాంటి పక్షపాత ధోరణి అవలంభించకుండా నిష్పక్షపాతంగా విచారణ జరపి దోషులపై కఠిన చర్యలు తీసుకొని ప్రజల్లో చట్టంపై విశ్వాసం కలిగించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని బీజేపీ స్పష్టం చేసింది.  డీజీపీ శివధర్ రెడ్డిని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన రాంచందర్ రావు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి తీవ్రంగా దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
బాన్సువాడ, కామారెడ్డి, రుద్రూర్ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన వరుస ఘటనలు రాష్ట్రంలో మత ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితులపై డీజీపీకి పూర్తి వివరాలతో వినతిపత్రం సమర్పించినట్లు వెల్లడించారు. బాన్సువాడ ఘటనపై మాట్లాడుతూ, ఒక హిందూ యువతి భక్తి గీతాలు వినడాన్ని అభ్యంతరం చెప్పి ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేయడం, అవమానించడం ద్వారా ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతను రెచ్చగొట్టారని ఆరోపించారు.
ఈ ఘటనకు నిరసనగా హిందూ సంస్థలు బంద్‌కు పిలుపునివ్వగా, ఆ సందర్భంలో ప్రధానంగా బిజెపికి చెందిన హిందూ యువకులనే లక్ష్యంగా చేసుకుని పోలీసులు ఏకపక్షంగా అరెస్టులు చేశారని విమర్శించారు.  సుమారు 27 మందిని జైలుకు పంపడమే కాకుండా, మరికొందరిని “తప్పిపోయారు”గా చూపుతూ వారి కుటుంబాలను వేధిస్తున్నారని తెలిపారు.
కామారెడ్డిలో, బిజెపి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు గుంపుగా వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ఘటనలో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారని, మజ్లీస్ పార్టీకి చెందిన వారి సహకారం కూడా ఉందని తెలిపారు. బిజెపి కార్యకర్తలు అడ్డుకోవడం వల్లే ఎమ్మెల్యేకు ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.
నిజామాబాద్ జిల్లా రుద్రూర్‌లో, స్థానిక న్యాయవాది కళ్యాణిపై దాడి చేయడం అత్యంత అమానుషమని పేర్కొంటూ ఒక మహిళా న్యాయవాదిపై దాడి జరగడం చట్టసువ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో సూచిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ ఘటన కూడా మత ఘర్షణ వాతావరణాన్ని సృష్టించేలా జరిగిందని తెలిపారు.  ఉత్తర తెలంగాణ మొత్తం మీద మజ్లీస్ పార్టీకి చెందిన అరాచకాలు పెరుగుతున్నాయని, కొన్ని వర్గాలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నాయని విమర్శించారు.
పోలీస్ వ్యవస్థ కూడా అధికార పార్టీ ఒత్తిళ్లకు లోబడి పనిచేస్తోందని, దాడులు ఎదుర్కొన్న వారిపైనే కేసులు పెట్టి, అసలు నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. జూబ్లీహిల్స్ లో అమ్మవారి ఆలయం, బార్కాస్ లో హనుమాన్ ఆలయం, సఫిల్‌గూడ, ముత్యాలమ్మ ఆలయం, కీసర హనుమాన్ ఆలయం వంటి పలు ఆలయాలపై జరిగిన దాడులను ప్రస్తావిస్తూ, ఇవన్నీ ఒకే దిశగా జరుగుతున్నాయా? దీని వెనుక ఎవరు ఉన్నారు? అని ప్రశ్నించారు. 
ఈ ఘటనలను అడ్డుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ప్రోత్సహిస్తున్నట్టు పరిస్థితులు ఉన్నాయని ఆయన మండిపడ్డారు.   `సంతృప్తి రాజకీయాలు’ వల్లే ఈ పరిస్థితులకు కారణమని పేర్కొన్న రాంచందర్ రావు బిజెపి కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయాలని, ఘర్షణలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు తెలిపారు.
 
రాష్ట్రంలో శాంతిభద్రతల బాధ్యత పూర్తిగా ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉందని పేర్కొంటూ హోంమంత్రిగా కూడా ఆయనే ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని స్పష్టం చేశారు. ఈ అంశాలపై డీజీపీ సానుకూలంగా స్పందించి, తగిన విచారణ చేపడతామని హామీ ఇచ్చారని వెల్లడించారు. ఈ బృందంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. గౌతం రావు, వేముల అశోక్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్యరు, బిజెపి మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ  తదితరులు పాల్గొన్నారు.