హనుమాన్ ఆలయంపై దాడి హిందూ వ్యతిరేక పాలనకు నిదర్శనం

హనుమాన్ ఆలయంపై దాడి హిందూ వ్యతిరేక పాలనకు నిదర్శనం
చాంద్రాయణగుట్టలో శ్రీ ద్విముఖి హనుమాన్ ఆలయంపై దాడి తెలంగాణలో కొనసాగుతున్న హిందూ వ్యతిరేక పాలనకు నిదర్శనం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు.  బర్కాస్ ప్రాంతంలో గల శ్రీ ద్విముఖి హనుమాన్ ఆలయంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి హనుమంతుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అత్యంత అమానుషం, హేయమైన చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో హిందూ దేవాలయాలు, దేవీదేవతల విగ్రహాలపై వరుసగా జరుగుతున్న దాడులు యాదృచ్ఛికం కావని, ఇవన్నీ సనాతన ధర్మంపై ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉండటం హిందూ సమాజంపై జరుగుతున్న దాడులకు పరోక్ష మద్దతు ఇచ్చినట్లేనని రావు స్పష్టం చేశారు.

ప్రతీ ఘటనలోనూ దోషులను కఠినంగా శిక్షించాల్సిన చోట, “పిచ్చివాడు”, “తప్పుదారి పట్టాడు” అంటూ సర్టిఫికెట్లు ఇవ్వడం ద్వారా హిందూ వ్యతిరేక శక్తులను కాంగ్రెస్ ప్రభుత్వం రెచ్చగొడుతోందని ఆయన విమర్శించారు. పోలీసుల తీరు చూస్తే రజాకార్ల పాలనను తలపిస్తోందని, హోంశాఖ ముఖ్యమంత్రి వద్దే ఉన్నా వరుస దాడులపై స్పందన లేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనమని ఆయన మండిపడ్డారు.

హిందూ పండుగలను లక్ష్యంగా చేసుకుని మనోభావాలను తీవ్రంగా గాయపరచడం, దేవాలయాలను అపవిత్రం చేయడం, విగ్రహాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు తీవ్రమైన ముప్పుగా మారాయని రామచందర్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఓటు బ్యాంక్ రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తూ, అసాంఘిక శక్తులపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతోందని ధ్వజమెత్తారు.

చాంద్రాయణగుట్ట హనుమాన్ ఆలయంపై దాడికి పాల్పడ్డ దోషులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని,  అలాగే రాష్ట్రంలోని అన్ని హిందూ దేవాలయాలకు పూర్తి భద్రత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే హిందూ సమాజాన్ని, సనాతన ధర్మాన్ని రక్షించేందుకు భారతీయ జనతా పార్టీ పోరాటాన్ని ఉధృతం చేస్తుందని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు.