కేరళ రాష్ట్రం పేరు ఇక అధికారికంగా కేరళమ్ గా మారనుంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ పేరుమార్పు ప్రతిపాదనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో మంగళవారం ఆమోదం తెలిపారు. ఇటీవల ప్రారంభించిన సేవా తీర్థం అనే కొత్త పిఎంఓ భవనంలో జరిగిన మొదటి మంత్రివర్గ సమావేశంలో ఈ ఆమోదం తెలిపారు.
కేరళ అసెంబ్లీ జూన్ 24, 2024న, రాష్ట్ర పేరును అధికారికంగా కేరళగా మార్చాలని కేంద్రాన్ని కోరుతూ ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. అసెంబ్లీ తీర్మానం తర్వాత కేంద్ర మంత్రివర్గం రాష్ట్ర పేరును కేరళ నుండి కేరళగా మార్చడానికి ఆమోదం తెలిపింది. మొదటి తీర్మానాన్ని సమీక్షించిన హోం మంత్రిత్వ శాఖ కొన్ని సాంకేతిక మార్పులను సూచించినందున కేరళ అసెంబ్లీ రెండవసారి ఈ తీర్మానాన్ని ఆమోదించింది.
పేరు మార్పుపై కేంద్రం అనుమతి కోసం కేరళ అసెంబ్లీ ఇప్పటికే పలుమార్లు తీర్మానాలు చేసింది. కేరళ పేరు మార్పుపై 2023లో కూడా రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపింది. తమ రాష్ట్రం పేరును పూర్వం నుంచే మలయాళంలో ‘కేరళమ్’ అని పిలిచేవారని ఆ తీర్మానంపై చర్చలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ గుర్తుచేశారు.
రాష్ట్రం పేరు మార్పు విషయంలో విజయన్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు తెలిపింది.
ఈ మేరకు ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఆ లేఖకు సీఎం బదులిస్తూ ‘రాష్ట్రం అసలు పేరు కేరళమ్. కానీ బ్రిటిషర్లు తమ సౌకర్యం కోసం కేరళగా మార్చారు. వారు చేసిన మార్పులను రాష్ట్ర సంస్కృతికి అనుగుణంగా సరిదిద్దుతున్నాం’ అని పేర్కొన్నారు. .. కేరళ పేరు మార్పు ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించడంతో ఇక రాజ్యాంగ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్రం పేరును ‘కేరళమ్’గా సవరించాల్సి ఉంటుంది. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో పేర్కొన్న అన్ని భాషల్లో ఈ మార్పులు చేయాల్సి ఉంటుంది.మలయాళం మాట్లాడే ప్రాంతాలను చారిత్రాత్మకంగా పలువురు రాజులు, సంస్థానాలు పాలించారు. 1920లలో ఐక్య (ఏకీకృత) కేరళ ఉద్యమం ఊపందుకుంది. మలబార్, కొచ్చి, ట్రావెన్‌కోర్‌లను ఏకం చేయడం ద్వారా మలయాళం మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేసింది.
స్వాతంత్ర్య ఉద్యమం నుండి ప్రేరణ పొందిన మలయాళీలు ఉమ్మడి భాష, సాంస్కృతిక సంప్రదాయాలు, సామాజిక ఆచారాలకు కట్టుబడి – రాజకీయ ఏకీకరణ కోసం ఒత్తిడి చేశారు. స్వాతంత్ర్యం తరువాత, రాచరిక రాష్ట్రాల ఏకీకరణ రాష్ట్ర హోదాకు మార్గం సుగమం చేసింది. జూలై 1, 1949న, ట్రావెన్‌కోర్, కొచ్చి విలీనం అయ్యి ట్రావెన్‌కోర్-కొచ్చిన్ రాష్ట్రంగా ఏర్పడ్డాయి.
కేంద్ర ప్రభుత్వం భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించుకున్నప్పుడు, సయ్యద్ ఫజల్ అలీ నేతృత్వంలోని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిషన్, మలబార్ జిల్లా, కాసర్‌గోడ్ తాలూకాను చేర్చి కేరళను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. అదే సమయంలో ప్రస్తుతం తమిళనాడులో భాగమైన ట్రావెన్‌కోర్ దక్షిణ తాలూకాలను మినహాయించింది.
నగరాల పేరు మార్చడం వలె కాకుండా, రాష్ట్రం పేరు మార్చడానికి రాజ్యాంగ సవరణ అవసరం. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిపాదన రావాలి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ అభ్యర్థనను పరిశీలించి, రైల్వే మంత్రిత్వ శాఖ, ఇంటెలిజెన్స్ బ్యూరో, పోస్ట్స్ శాఖ, సర్వే ఆఫ్ ఇండియా, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వంటి సంస్థల నుండి నిరభ్యంతర ధృవీకరణ పత్రాలను (ఎన్ఓసిలు) కోరుతుంది.
ఆమోదం పొందితే, ఈ ప్రతిపాదన పార్లమెంటులో బిల్లుగా ప్రవేశపెడతారు. ఆమోదం పొంది నోటిఫై చేసిన తర్వాత, కొత్త పేరు అమలులోకి వస్తుంది. గతంలో, పశ్చిమ బెంగాల్‌ను బంగ్లాగా పేరు మార్చాలనే 2018 ప్రతిపాదన బంగ్లాదేశ్‌తో సారూప్యత గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత ఆమోదం పొందలేదు.

More Stories
డీజీపీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు
ఏఐ సమ్మిట్ లో నిరసనపై యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అరెస్ట్
భారత్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యుపి