బ్ర‌హ్మోస్ క‌న్నా వేగమైన గోల్డెన్ హోరైజ‌న్ స‌ర‌ఫ‌రాకు ఇజ్రాయిల్ ఆస‌క్తి

బ్ర‌హ్మోస్ క‌న్నా వేగమైన గోల్డెన్ హోరైజ‌న్ స‌ర‌ఫ‌రాకు ఇజ్రాయిల్ ఆస‌క్తి

బ్ర‌హ్మోస్ క్షిప‌ణి క‌న్నా వేగంగా ప్ర‌యాణించే గోల్డెన్ హోరైజ‌న్ క్షిప‌ణిని..  భార‌త్‌కు అమ్మేందుకు ఇజ్రాయిల్ ఆస‌క్తిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. గోల్డెన్ హోరైజ‌న్ ఎయిర్ లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్‌ను డీప్ స్ట్ర‌యిక్ వెప‌న్‌గా డిజైన్ చేశారు. చాలా క‌ట్టుదిట్ట‌మైన, అండ‌ర్‌గ్రౌండ్ కేంద్రాల‌ను కూడా ఇది ధ్వంసం చేయ‌గ‌ల‌దు.  ఇజ్రాయిల్‌కు చెందిన సిల్వ‌ర్ స్పారో క్షిప‌ణి వ్య‌వ‌స్థ నుంచే గోల్డెన్ హోరైజ‌న్ మిస్సైల్‌ను అభివృద్ధి చేశారు. బాలిస్టిక్ బెదిరింపుల‌ను ఎదుర్కొనే రీతిలో ఈ మిస్సైల్‌ను రూపొందించారు.

ఫైట‌ర్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి ప్ర‌యోగించే రీతిలో కొత్త వేరియంట్‌ను అభివృద్ధి చేసిన‌ట్లు ర‌క్ష‌ణ శాఖ నిపుణులు చెబుతున్నారు. వాస్త‌వానికి ఈ క్షిప‌ణికి సంబంధించిన అధికారిక స‌మాచారాన్ని ఇంకా వెల్ల‌డించ‌లేదు. కానీ ర‌క్ష‌ణ‌శాఖ నివేదిక‌ల ప్ర‌కారం ఈ క్షిప‌ణి సుమారు రెండు వేల కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించ‌గ‌ల‌ద‌ని తెలుస్తోంది. అవ‌స‌ర‌మైతే దీన్ని భార‌త వైమానిక ద‌ళంలో ఉన్న సుఖోయ్ 30ఎంకేఐ ఫ్లీట్‌లో చేర్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు భావిస్తున్నారు. దీని వ‌ల్ల మ‌న వైమానిక సామ‌ర్థ్యం పెరిగే అకాశం ఉన్న‌ది.

ప్ర‌స్తుతం భారత్ వ‌ద్ద చాలా మిస్సైల్స్ ఉన్నాయి. ఒక‌వేళ ఆ అమ్ముల‌పొదిలోకి ఈ గోల్డెన్ హోరైజ‌న్ చేరితే అప్పుడు భార‌త్ సామ‌ర్థ్యం మ‌రింత బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉన్న‌ది. గ‌తంలో లారా లాంటి మిస్సైల్ సిస్ట‌మ్‌ను భారత్ కు ఇజ్రాయిల్ సరఫరా చేసింది. దాని రేంజ్ సుమారు 400 కిలోమీట‌ర్లు. 250 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్ల‌ను చేజించే రాంపేజ్ మిస్సైల్‌ను ఇజ్రాయిల్ ఇచ్చింది. 

రేడార్ స్టేష‌న్లు, ఎయిర్ డిఫెన్స్ బ్యాట‌రీలు, క‌మాండ్ సెంట‌ర్లు, అమ్యూనిష‌న్ డిపోల‌ను టార్గెట్ చేసేందుకు ఆ క్షిప‌ణులు ఉప‌యోగ‌ప‌డుతాయి. అయితే గోల్డెన్ హోరైజ‌న్‌ను మాత్రం ఇంకా స‌మ‌ర్థ‌వంతంగా తీర్చిదిద్దారు. చాలా లోతుగా ఉండే బ‌ల‌మైన కాంక్రీట్‌ను చీల్చుకుంటూ అండ‌ర్ గ్రౌండ్ బంక‌ర్ల‌ను ధ్వంసం చేసే రీతిలో ఈ క్షిప‌ణిని అభివృద్ధి చేశారు. అణ్వాయుధ క్షేత్రాల‌ను కూడా ఈ క్షిప‌ణి చిత్తుచేస్తుంది. 

గ‌గ‌న‌త‌లం నుంచి ప్ర‌యోగించే క్షిప‌ణి త‌ర‌హాలో గోల్డెన్ హోరైజ‌న్ చాలా వేగంగా ఆల్టిట్యూడ్‌ మారుతుంది. దీని ట‌ర్మిన‌ల్ వెలాసిటీ వేగం హైప‌ర్ సోనిక్ స్థాయిలో ఉంటుంది. ధ్వ‌ని వేగం క‌న్నా వేగంగా దాదాపు మాక్ 5 స్థాయిలో ఈ క్షిప‌ణి ప్ర‌యాణిస్తుంది. చివ‌రి ద‌శ‌లో ఆ క్షిప‌ణి నుంచి రిలీజ‌య్యే కైనిటిక్ ఎన‌ర్జీ వ‌ల్ల‌.. చాలా లోతుగా భూగ‌ర్భంలోకి ఆ క్షిప‌ణి వెళ్తుంది. గోల్డెన్ హోరైజ‌న్‌ను స‌ర‌ఫ‌రా చేసేందుకు ఇజ్రాయిల్ ఆస‌క్తిగా ఉన్నా ఆ మిస్సైల్‌ను కొనేందుకు భారత్ ఆస‌క్తిగా ఉందా లేదా అన్న విష‌యం ఇంకా స్ప‌ష్టంగా తెలియ‌దు.