ప్రస్తుతం భారతీయ వైమానిక దళంలో సుమారు 35 స్వదేశీ యుద్ధవిమానం తేజస్ యుద్ధ విమానాలు ఉన్నాయి. మెయింటేనెన్స్ చెకింగ్ నేపథ్యంలో ఆ యుద్ధ విమానాలను గ్రౌండ్ చేసినట్లు ఐఏఎఫ్ వర్గాలు వెల్లడించాయి. ఫిబ్రవరి 7వ తేదీన సరిహద్దు ప్రాంతానికి సమీపంలోని వాయుసేన ఎయిర్‌బేస్‌లో ల్యాండింగ్ సమయంలో తేజస్ ఫైటర్ జెట్ రన్‌వేను దాటి వెళ్లడంతో విమానం నిర్మాణ భాగాలకు నష్టం వాటిల్లినట్లు సమాచారం.
ఆ ఘటనలో పైలట్ ముందస్తు జాగ్రత్త పడడంతో సురక్షితంగా బయటపడ్డాడు. ఫిబ్రవరి 7వ తేదీన రన్‌వే సమీపంలో ఉన్న బురద గుంటలో ఆ విమానం పడింది. వాస్తవానికి ఆ ప్రమాదానికి చెందిన పూర్తి నివేదిక లేదు. కానీ తమ దళంలో ఉన్న అన్ని తేజస్ విమాలను చెక్ చేయాలని ఐఏఎఫ్ ఆదేశించింది. ఆ ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేయకపోయినా, భారత వాయుసేన ముందు జాగ్రత్త చర్యగా తమ వద్ద ఉన్న దాదాపు 30 సింగిల్‌సీట్ తేజస్ విమానాలను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.
ప్రతి విమానాన్ని సాంకేతికంగా పూర్తిగా తనిఖీ చేసి భద్రతా ప్రమాణాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. విమానాలను గ్రౌండ్ చేసిన తర్వాత వాటిని పూర్తిగా, క్షుణ్ణంగా పరీక్షిస్తారు. వీల్స్‌కు చెందిన ఎలక్ట్రోమ్యాగ్నటిక్ బ్రేకింగ్ సిస్టమ్, ఆన్‌బోర్డ్ సాఫ్ట్‌వేర్ ను తనిఖీ చేస్తారు. ఆ రోజు సింగిల్ సీటు విమానం ప్రమాదానికి గురైంది. దాంట్లో ఉన్న పైలెట్ సురక్షితంగా ఉన్నారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కేవలం టేకాఫ్ స్పీడ్‌తో జెట్ ఉన్నట్లు గుర్తించారు.
ఆ స్పీడ్ కేవలం 170 కిలోమీటర్ల మాత్రమే ఉన్నది. ఫిబ్రవరి ఏడో తేదీ ఘటన గురించి కానీ, ఫ్లీట్‌లో ఉన్న విమానాల గ్రౌండింగ్ గురించి కానీ ఐఏఎఫ్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆ ప్రమాదం పట్ల కోర్టు విచారణకు ఆదేశించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసిన ఎల్‌సీఏ తేజస్ ఒక సింగిల్ ఇంజిన్, మల్టీ రోల్ ఫైటర్ జెట్. దీన్ని ఏరానాటికల్ డెవలప్మెంట్ ఏజన్సీ అభివృద్ధి చేసింది.
గగనతల రక్షణ, సముద్ర పర్యవేక్షణ, కచ్చితమైన దాడులు వంటి అనేక మిషన్లకు అనువుగా ఆ విమానాన్ని రూపొందించారు. 2003లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి దీనికి తేజస్ అనే పేరు పెట్టారు. సంస్కృతంలో తేజస్ అంటే కాంతి, శక్తి అనే అర్థం. తేజస్ విమానాలు 2016 నుంచి వాయుసేనలో సేవలు అందిస్తున్నాయి. ఇప్పటి వరకు మూడు తేజస్ విమానాలు కూలాయి. 2016లో తొలి తేజస్ కూలింది. 2024 జైసల్మేర్‌లో ఆ ఘటన జరిగింది. 2025 నవంబర్‌లో రెండో ఘటన జరిగింది. దుబాయ్ ఎయిర్‌షోలో విన్యాసం చేస్తూ ఓ విమానం పేలింది. ఆ ప్రమాదంలో వింగ్ కమాండర్ నమాన్ష్ సయల్ ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి 7వ తేదీన జరిగిన ఘటన క్రాష్ కాదు అని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ తెలిపింది.
40 తేజస్ విమానాలకు ఆర్డర్ చేయగా, ప్రస్తుతం 35 సర్వీసులో ఉన్నాయి. మరో రెండు డెలివరీ చేయాల్సి ఉన్నది. మరో 180 తేజస్ మార్క్ 1ఏ విమానాల డెలివరీ ఇప్పటికే రెండేళ్ల ఆలస్యమైంది. ఇప్పటికే తేజస్ తయారీ, సరఫరా విషయంలో ఆలస్యం జరుగుతోంది. 2021లో రక్షణ మంత్రిత్వ శాఖ 83 తేజస్ ఎంకె1ఏ జెట్ల కొనుగోలుకు భారీ ఒప్పందం కుదుర్చుకుంది. తర్వాత మరిన్ని 97 విమానాలకు మరో ఒప్పందం జరిగింది.
కానీ ఇంజిన్ల సరఫరాలో జాప్యం కారణంగా ఉత్పత్తి షెడ్యూల్ వెనుకబడింది. ముఖ్యంగా జీఈ ఎయిర్స్పేస్ ఇంజిన్ల డెలివరీల్లో ఆలస్యం కావడం ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజా ప్రమాదం తేజస్పై మరింత ఒత్తిడి తీసుకువచ్చే అవకాశముంది. అయినప్పటికీ, వాయుసేన వర్గాలు తేజస్‌పై పూర్తి విశ్వాసమే ఉందని, భద్రతా ప్రమాణాలను మరింత కఠినంగా అమలు చేస్తామని చెబుతున్నాయి.
తేజస్ జెట్లను పూర్తిగా పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతున్నా, అది తాత్కాలిక జాగ్రత్త చర్య మాత్రమేనని స్పష్టం చేస్తున్నాయి. సాంకేతిక తనిఖీలు పూర్తయిన తర్వాత మళ్లీ సేవల్లోకి తీసుకొస్తారు. స్వదేశీ యుద్ధవిమానంగా దేశ గర్వంగా నిలిచిన తేజస్ ప్రాజెక్ట్‌కు ఘటనలు సవాళ్లుగా మారినా, లోపాలను సరిదిద్దుతూ మరింత మెరుగైన భద్రతతో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా వాయుసేన కృషి చేస్తోంది.
More Stories
భారత్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యుపి
ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. ప్రహార్ పాలసీ
ఏపీలో ప్రమాదంలో గ్రామ సచివాలయాలు