26/11 ముంబయి ఉగ్రదాడి కుట్రదారుల్లో కీలకుడిగా భావిస్తున్న తహవ్వుర్ రాణా పౌరసత్వాన్ని రద్దు చేసే దిశగా కెనడా ప్రభుత్వం ముందడుగు వేసింది. కెనడా కొత్త ప్రధాని మార్క్ కార్నీ భారత్ పర్యటనకు సరిగ్గా రెండు రోజుల ముందు ఈ పరిణామం జరగడం గమనార్హం. పాకిస్థాన్లో జన్మించిన తహవ్వుర్ రాణా వృత్తిరీత్యా వ్యాపారవేత్త. 1997లో కెనడాకు వలస వెళ్లాడు. 2001లో అక్కడి పౌరసత్వం పొందాడు.
కెనడాలో ఉన్నా నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సంబంధాలు కొనసాగించాడు. 26/11 ముంబయి దాడుల సమయంలో ఉగ్రవాదులకు అవసరమైన మౌలిక వసతులు, ఇమ్మిగ్రేషన్ డాక్యుమెంట్లు, దాడులకు సంబంధించిన రెక్కీ నిర్వహించడంలో కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. రాణాకు అమెరికా, కెనడా దేశాల పౌరసత్వాలు ఉన్నాయి.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కెనడా ప్రభుత్వం రాణా పౌరసత్వాన్ని ఉగ్రవాద ఆరోపణల కారణంగా రద్దు చేయడం లేదు. అతను పౌరసత్వం పొందే క్రమంలో చేసిన ‘వంచన’ ఆధారంగా రద్దు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. 2000లో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, రాణా తాను కెనడాలోని ఒట్టావా, టొరంటో నగరాల్లో నాలుగేళ్లు నివసించినట్లు పేర్కొన్నాడు.
ఆ సమయంలో తాను కేవలం 6 రోజులు మాత్రమే దేశం వెలుపల ఉన్నట్లు అబద్ధం చెప్పాడు. కెనడా రాయల్ మౌంటెడ్ పోలీస్ జరిపిన విచారణలో రాణా ఆ నాలుగేళ్ల కాలంలో ఎక్కువ భాగం అమెరికాలోని షికాగోలో ఉన్నట్లు తేలింది. పౌరసత్వ నిబంధనల ప్రకారం కనీస కాలం దేశంలో నివసించాలనే నిబంధనకు విరుద్ధంగా రాణా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చాడని, ఇది అత్యంత తీవ్రమైన నేరమని ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్ధారించారు.
గత ప్రధాని జస్టిన్ ట్రూడో హయాంలో భారత్-కెనడా సంబంధాలు అత్యంత పతన స్థాయికి పడిపోయాయి. ఖలిస్థానీ అనుకూల అంశాల వల్ల ఏర్పడిన విబేధాలను తొలగించి, సంబంధాలను మళ్లీ పునరుద్ధరించాలని ప్రస్తుత ప్రధాని మార్క్ కార్నీ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 26న కార్నీ ఢిల్లీకి వస్తున్నారు. ఈ పర్యటనకు ముందు తహవ్వూర్ రాణా వంటి ఉగ్రవాద నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా, ఉగ్రవాదంపై భారత్ పోరాటంలో కెనడా అండగా ఉంటుందనే బలమైన సందేశాన్ని ఆయన పంపారు. రాణా ప్రస్తుతం భారత్ కస్డడీలోనే ఉన్నాడు.

More Stories
భారత్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న యుపి
యూనుస్ చర్యలన్నీ చట్టవ్యతిరేకమే
బంగ్లాలో హిందూ మహిళపై సామూహిక అత్యాచారం