“అసోంలో కాంగ్రెస్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రాష్ట్రం గురించి ఆందోళన చెందుతున్న వారు ఇకపై కాంగ్రెస్‌లో ఉండలేరు” ఆ పార్టీతో 32 ఏళ్ళ అనుబంధాన్ని తెంచుకొని ఆదివారం బీజేపీలో చేరిన ప్రదేశ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా స్పష్టం చేశారు. అసోం ఉద్యమంలో అమరులైన వారిని దోపిడీదారులుగా హస్తం పార్టీ నేతలు ముద్రవేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
గౌహతిలోని అస్సాం బిజెపి ప్రధాన కార్యాలయం వాజ్‌పేయి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో బిజెపి అధ్యక్షుడు దిలీప్ సైకియా సమక్షంలో బోరా అధికారికంగా బిజెపిలో చేరారు. మాజీ కాంగ్రెస్ కార్యకర్త సంజు బోరా కూడా ఆయనతో పాటు కాషాయ పార్టీలో చేరారు. బోరా బీజేపీలో చేరడంపై ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ శుభాకాంక్షలు తెలిపారు.
“ఈరోజు, అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు భూపెన్ బోరా బిజెపిలో చేరారు. భూపెన్ బోరా కాంగ్రెస్‌కు 30 సంవత్సరాలు పార్టీకి సేవలందించారు. నేటి నుండి, ఆయన తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తారు. బిజెపి ‘దేశం ముందు’ విధానాన్ని సమర్థిస్తూ, మేము కలిసి పని చేస్తాము. భూపెన్ బోరా కొత్త రాజకీయ ప్రయాణానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని శర్మ పేర్కొన్నారు.
బోరా రెండు రోజుల ముందు హోంమంత్రి గౌహతిలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో ముఖ్యమంత్రి హిమంత, బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా, లఖింపూర్ ఎమ్మెల్యే మనబ్ డేకా సమక్షంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిశారు.
“కాంగ్రెస్ ఎమ్మెల్యే షెర్మాన్ అలీ అసోం ఉద్యమ అమరవీరులందరినీ దోపిడీదారులు అని విమర్శించారు. నేను అతడ్ని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాను. అసోంలోని మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే పూజారులందరూ రేపిస్టులని ఆరోపించారు. ఇప్పుడు జలేశ్వర్ నియోజకవర్గంలో ఆయన కాంగ్రెస్ టికెట్‌పై పోటీకి సిద్ధమవుతున్నారు” అని బీజేపీలో చేరిన తర్వాత ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
అసోం కాంగ్రెస్ చీఫ్ గౌరవ్ గొగొయ్ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 45 అసెంబ్లీ సీట్లు ముస్లింలకు రిజర్వ్ చేస్తారని మరో కాంగ్రెస్ ప్రతినిధి అన్నారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకుడు అమన్ వదుద్ తాను రాసిన పుస్తకంలో అసోం ప్రజలు స్వదేశీయులు కాదని రాశారని భూపేన్ కుమార్ బోరా పేర్కొన్నారు. తనను అసోం కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత గౌరవ్ గొగొయ్ అమన్ వదుద్‌ను సోషల్ మీడియా అధిపతిగా నియమించారని గుర్తు చేశారు. అస్సామీలు స్వదేశీయులు కాదని వదుద్ ఒక పుస్తకం రాశారని, అలాంటి వారితో తాను ఎలా కలిసి పనిచేయగలనని ప్రశ్నించారు.

More Stories
రా, ఆర్ఎస్ఎస్లపై ఆంక్షలు… అమెరికా నివేదికపై భారత్ కన్నెర్ర
రాజ్యసభ ఎన్నికల్లో ఎన్డీయే జోరు
ఆస్కార్ వేదికపై భారతీయ సినీ దిగ్గజాలకు నివాళి