భారతీయుల నైపుణ్యాలు బైటవారికే .. పిట్రోడా వ్యాఖ్యలపై దుమారం 

భారతీయుల నైపుణ్యాలు బైటవారికే .. పిట్రోడా వ్యాఖ్యలపై దుమారం 

భారత పౌరుల నైపుణ్యాలు బయటి దేశాలకు సేవలు చేసేందుకే దోహదపడుతున్నాయని, దేశంలో సుమారు 150 కోట్ల జనాభా ఉన్నా సొంతంగా ఆపరేటింగ్‌ సిస్టమ్‌  లేకపోవడం సిగ్గుచేటని కాంగ్రెస్‌ పార్టీ ఓవర్సీస్‌ ఛైర్మన్‌ శామ్‌పిట్రోడా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో పిట్రోడా చేసిన ఈ వ్యాఖ్యలపై అధికార బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడగా, మరోసారి కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలోకి నెట్టివేశాయి. 

ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ పిట్రోడా 150 కోట్ల జనాభా కలిగిన దేశం ఇప్పటికీ విదేశీ సాంకేతికతపై ఆధారపడటం దురదృష్టకరమని పేర్కొన్నారు. ‘మనం భారీ స్థాయిలో యువ ప్రతిభను సృష్టించాం, కానీ అది ఇంకా ‘ముడి’ రూపంలోనే ఉంది. ఈ ప్రతిభ అంతా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహుళజాతి కంపెనీలకు ప్రోగ్రామింగ్, బ్యాంకింగ్, న్యాయ వ్యవస్థలు, తయారీ, లాజిస్టిక్స్ రంగాల్లో సేవ చేయడానికి ఉపయోగపడుతోంది. మనం మన సొంత ప్రతిభను ఇతరులకు సేవ చేయడానికి ధారపోస్తున్నాం’ అని విమర్శించారు.

అంతేకాకుండా,  భారత్ మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీని గానీ, ప్రపంచ స్థాయి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను గానీ సృష్టించలేేదని చెప్పుకొచ్చారు. కనీసం మొబైల్ ఫోన్ల కోసం ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా తయారు చేయలేకపోయామని తెలిపారు. ఇంత పెద్ద దేశానికి సొంత ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోవడం నిజంగా సిగ్గుచేటని ఘాటుగా వ్యాఖ్యానించారు.

పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పూనావాలా సోషల్ మీడియా వేదికగా పిట్రోడా వ్యాఖ్యలకు ఖండించారు. దేశంలో తయారైన పలు ఆపరేటింగ్ సిస్టమ్‌ల పేర్లను ఆయన ప్రస్తావించారు. ‘ముందుగా వాస్తవాలు తెలుసుకోండి. భారత్ వద్ద లినక్స్‌, మాయ ఓఎస్‌, ప్రైమ్‌ఓఎస్‌, భార్‌ఓఎస్‌, ఇండస్‌ ఓఎస్‌, NxtQuantum OS వంటి స్వదేశీ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అబద్ధాలతో భారత్‌ను కించపరచడమే కాంగ్రెస్ పని’ అని ఆయన మండిపడ్డారు.

ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అయిన యూపీఐని భారత్ సృష్టించిందని, అది నేడు అనేక దేశాలకు ఆదర్శంగా నిలిచిందని ఆయన  గుర్తు చేశారు. గ్లోబల్ టెక్నాలజీ రంగంలో భారత్ ఇప్పుడు ‘నాయకత్వ’ పాత్రకు చేరుకుందని తెలిపారు. కరోనా కాలంలో భారత్ స్వదేశీ వ్యాక్సిన్లను తయారు చేసి ప్రపంచ దేశాలకు సరఫరా చేసిందని, రక్షణ రంగంలో కూడా ‘మేక్ ఇన్ ఇండియా’ వేగంగా పుంజుకుంటోందని వివరించారు.

సామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గత రెండు ఏళ్లలో ఆయన చేసిన పలు కామెంట్స్ కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పడేశాయి. భారతదేశ వైవిధ్యాన్ని వివరిస్తూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీశాయి.  తూర్పు భారతీయులు చైనీయుల్లా, పశ్చిమ భారతీయులు అరబ్బుల్లా, ఉత్తరాది వారు తెల్లజాతి వారిలా, దక్షిణాది వారు ఆఫ్రికన్లలా కనిపిస్తారని ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపాయి.

దీనిపై ప్రధాని మోదీ స్వయంగా స్పందిస్తూ, ఇది దేశ ప్రజలను అవమానించడమేనని విమర్శించారు.  ఫలితంగా పిట్రోడా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. పాకిస్థాన్‌తో సంబంధాల విషయంలోనూ ఆయన అన్న మాటలు వివాదాస్పదంగా మారాయి. పొరుగు దేశాలతో, ముఖ్యంగా పాకిస్థాన్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని పిట్రోడా సూచించారు. 

“నేను పాకిస్థాన్‌కు వెళ్లినప్పుడు నాకు సొంత ఇంట్లో ఉన్నట్లే అనిపించింది” అని ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శించింది. అయోధ్య రామమందిర నిర్మాణం జరుగుతున్న సమయంలో ‘రామమందిరం అసలైన సమస్యా? లేక నిరుద్యోగం, ద్రవ్యోల్బణమా?’ అని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెట్టాయి.