ఇరాన్‌లోని భారత పౌరులు తక్షణమే దేశం విడవండి

ఇరాన్‌లోని భారత పౌరులు తక్షణమే దేశం విడవండి

ఏ క్షణమైనా ఇరాన్‌ పై అమెరికా దాడులు చేయవచ్చునన్న అంచనాలు, విద్యార్థుల ఆందోళనలతో ఆ దేశంలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌లోని భారత పౌరులకు అక్కడి మన ఎంబసీ తాజాగా అడ్వయిజరీ జారీచేసింది. తక్షణమే ఆ దేశాన్ని వీడాలని సూచించింది.

‘ఇరాన్‌లో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా జనవరి 5న భారత ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలకు కొనసాగింపుగా మళ్లీ అడ్వయిరీ జారీ చేస్తున్నాం. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారతీయులు (విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు) కమర్షియల్ విమానాలతో సహా అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గాల ద్వారా ఇరాన్‌ను తక్షణమే విడిచిపెట్టి వెళ్లండి’ అని ఇరాన్‌లోని భారత ఎంబసీ తన అడ్వయిజరీలో పేర్కొన్నది.

భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని, ఆందోళనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఇరాన్‌లోని భారత ఎంబసీతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ ఉండమని సూచించింది.  అలాగే తాజా పరిణామాల సమాచారం కోసం స్థానిక మీడియాను గమనిస్తూ ఉండాలని సూచించింది. 

భారతీయులంతా పాస్‌పోర్ట్‌లు, ఐడీ కార్డులతో సహా తమ ప్రయాణ, ఇమిగ్రేషన్ పత్రాలను ఎల్లప్పుడూ తమవద్ద సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పింది. ఈ విషయంలో ఎలాంటి సాయం కోసమైనా భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని పేర్కొంది. ఇప్పటివరకు ఎంబసీ వద్ద మీ పేర్లు నమోదు చేసుకోకపోతే వెంటనే రిజిస్టర్‌ చేయించుకోవాలి’ అని భారత ఎంబసీ తన అడ్వయిజరీలో తెలిపింది.

ఇరాన్‌-అమెరికా దేశాల మధ్య అణు చర్చలు ఇప్పటికీ కొలిక్కిరాలేదు. ఈ చర్చలు విఫలమైతే ఇరాన్‌పై దాడికి వెనుకాడబోమని అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ సంకేతాలిచ్చారు. ఇప్పటికే అమెరికా పలు విమాన వాహక నౌకలు, జలాంతర్గాములు, ఫైటర్‌ జెట్‌లను పశ్చిమాసియాలో మోహరించింది. ఈ నేపథ్యంలోనే టెహ్రాన్‌లో మరోసారి ఆందోళనలు చెలరేగాయి. 

జనీవాలో గురువారం ఇరాన్​, అమెరికాల మధ్య అణు ఒప్పందంపై చర్చలు జరగాల్సి ఉంది. కానీ ఇరాన్​పై అమెరికా దాడి చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. అందుకే భారత్ అప్రమత్తమైంది. వాస్తవానికి భారత ప్రభుత్వం 2026 జనవరి 5న ఒక అడ్వైజరీ జారీ చేసింది. కాగా ఇప్పుడు ఆ అడ్వైజరీలోని అంశాలనే ఇరాన్​లోని రాయబార కార్యాలయం మరోసారి పునరుద్ఘాటించింది.