* నాపై ఏ ఒక్క అవినీతి బయటపడినా రాజీనామా చేస్తా .. బిజెపి ఎమ్మెల్యే
పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నించడంతో ఒకరిద్దరు బీజేపీ కార్యకర్తలు కారుకు నిప్పంటించే ప్రయత్నం చేశారు. దీంతో మంటలు చెలరేగాయి. పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దౌర్జన్యాన్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కామారెడ్డికి వచ్చేందుకు ప్రయత్నించారు.
పోలీసులు వారిని ఎక్కడికక్కడే అడ్డుకుని అరెస్టు చేశారు. కామారెడ్డి బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును హైదరాబాద్‌లోనే పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డిలు హైదరాబాద్ నుంచి వస్తుండగా మేడ్చల్ వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, పలువురు బీజేపీ నాయకులను భిక్కనూర్ టోల్‌ప్లాజా వద్ద అరెస్టు చేసి నిజామాబాద్‌కు తరలించారు.
ఇలా ఉండగా, తనను అవినీతిలో కింగ్ అన్నారని, తనపై ఏ ఒక్క అవినీతి బయటపడినా స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తానని కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి స్పష్టం చేశారు. కామారెడ్డి వేదికగా మీడియాతో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓడిపోయిన కామారెడ్డిలో షబ్బీర్ అలీ అన్నీ తానే అంటున్నారని చెప్పుకొచ్చారు. తనను కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్, జడ్పీటీసీ చేశామని అన్నారని, ఆయన కామారెడ్డికి చేసిందేమీ లేదని విమర్శించారు.
ఇలా ఉండగా, ఎమ్యెల్యే వెంకట రమణారెడ్డి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన దాడిని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎం రామచందర్ రావు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో చర్చకు స్థానం ఉండాలి గానీ, హింసకు కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకుల రాజకీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఈ విధమైన అల్లర్లకు పాల్పడటం అత్యంత దుర్మార్గం అంటూ మండిపడ్డారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేస్తూ కామారెడ్డిలో ప్రజల ప్రశాంతతకు భంగం కలిగిస్తే బిజెపి సహించదని హెచ్చరించారు.

More Stories
భారత్- బ్రెజిల్ మధ్య వ్యూహాత్మక అవగాహన
తిరుమల శ్రీవారి సేవలో పరిమళిస్తున్న పుష్పాలు
జగిత్యాల జిల్లాలో కుల బహిష్కరణ అంటూ తప్పుడు ప్రచారం