కర్ణాటకలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నసీర్ రాయచోటిలో అరెస్ట్ 

కర్ణాటకలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ నసీర్ రాయచోటిలో అరెస్ట్ 
అన్నమయ్య పాత జిల్లా కేంద్రం రాయచోటి కరుడుగట్టిన నేరస్తులకు, అంతర్జాతీయ ఉగ్రవాదులకు కేరాఫ్ గా నిలుస్తోంది. బయట రాష్ట్రాల నుంచి కరుడుగట్టిన నేరస్తులు ఉగ్రవాదం మరకలు అంటిన వారు తలదాచుకోవడానికి రాయచోటినే ఎంచుకుంటున్నారు.  తాజాగా కర్ణాటక రాష్ట్రంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా పేరుగాంచిన నసీర్ రాయచోటిలో అరెస్ట్ చేశారు.
 
నసీర్ రాయచోటిలో నివసించడానికి గతంలో ఓ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ముస్లిం మైనారిటీ నాయకుడు అండదండలు అందించినట్లు విమర్శలు ఉన్నాయి. అక్కడ నుంచి ఆధార్ కార్డు తయారీ,  పాస్  పోర్ట్  తయారీ, పోలీసుల కళ్ళు కప్పి  తప్పించుకునే ట్రిక్కులు వంటి అంశాలలో ఆ నేత నసీర్ కు సహకరిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
 
ఇతనిపై కర్ణాటక రాష్ట్రంలో మొత్తం 26 కేసులున్నాయి. వాటిలో 13 కేసులు విచారణలో ఉన్నాయి. రెండు కేసుల్లో జీవిత ఖైదు పడినట్టు సమాచారం. మరో నాలుగు హత్య కేసులు విచారణలో ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రంలో నమోదైన ఈ నేరాలను తప్పించుకోవడానికి నసీర్ మంగళూరు నుంచి రాయచోటికి వచ్చినట్టు సమాచారం.  మంగళూరుకు చెందిన నసీర్ ను గతవారం కర్ణాటక రాయచోటి పోలీసులు సంయుక్తంగా రెక్కీ నిర్వహించి పట్టుకున్నారు. 
అతనితో పాటు మరో ఇద్దరు కూడా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. పోలీసులకు చిక్కిన నసీర్ అసలు పేరు సఫాన్ హుస్సేన్ హమబి. రాయచోట్లో మాత్రం షేక్ యూసఫ్ గా చలామణి అవుతున్నట్టు పోలీసు విచారణలో బట్టబయలైంది. పాస్ పోర్ట్ లో అతని పేరు ఈమర్  మహమ్మద్ షాసిర్గా ఉన్నట్టు సమాచారం.
 
ఇక ఆ నేరస్తుడికి రాయచోటి పట్టణంలో వివాహం చేస్తే స్థానిక బలం పెరుగుతుందని భావించి కొత్తపల్లిలోని ఓ యువతిని మాట్లాడి వివాహం చేసినట్టు కూడా తెలుస్తోంది. దీంతో నసీర్ రాయచోటి వాసిగా అందరికీ పరిచయం అవుతూ వస్తున్నాడు.   చిన్నతనం నుంచే నేర చరిత్రను సంపాదించినట్టు పోలీసు విచారణలో తేలుతోంది.  హత్యలు, అత్యాచారాలు వంటివి అతనికి చాలా చిన్న పనుల్లా కనిపిస్తున్నట్టు పోలీసు వర్గాలు ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నాయి.
ఇప్పటికే తనపై 26 కేసులు ఉండగా అందులో సుమారు పది కేసులు పోలీసులను చంపడానికి ప్రయత్నించిన కేసులేనని సమాచారం. నసీర్ సోదరులుగా చలామణి అవుతూ ఎన్నో నేరాల్లో నిందితులుగా ఉన్న షేక్ మహమ్మద్ సాదిక్ అలియాస్ సంసుద్దీన్ షేక్ ఇర్ఫాన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.  వీరిద్దరిలో ఒకరు సౌదీ అరేబియాలోను,  ఇంకొకరు బెంగళూరులోనూ ఉన్నట్టు తెలుస్తోంది. వీరు ముగ్గురూ మంగళూరుకు చెందినవారుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
వారు ముగ్గురు అన్నదమ్ములుగా రాయిచోట్లో చలామణి అవుతూ చికెన్ పకోడీ వ్యాపారాలు, తోపుడుబండ్లపై ఎర్రగడ్డలు టమోటాల వ్యాపారాలు, పండ్ల వ్యాపారాలు చేసుకుంటూ గల్ఫ్ దేశాలకు తరచుగా వెళ్లి వచ్చే వారని స్థానికులు చెబుతున్నారు.  వీరు ముగ్గురు రాయచోటిలోని కొత్తపల్లి లో వివాహాలు చేసుకున్నారు. ఈ ముగ్గురిలో నసీర్ రాయచోటి పట్టణం కొత్తపల్లికి చెందిన ఇస్మాయిల్, సిరాజ్ ఉన్నిసా కుమార్తె రేష్మ సుల్తానాను వివాహం చేసుకున్నాడు. 
2021లో నసీర్ కు వివాహం జరగ్గా ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. తక్కిన ఇద్దరిలో షేక్ మహమ్మద్ సాదిక్ షేక్ ఇర్ఫాన్ కూడా రాయచోటిలోననే వివాహం చేసుకున్నారు.  వీరిలో పోలీసుల అదుపులో ఉన్న నసీర్ కు రాయచోటి పట్టణంలో కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. ఏడాది క్రితం తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఇద్దరు అంతర్జాతీయ ఉగ్రవాదులు కొన్ని సంవత్సరాల కాలంగా రాయచోటి ప్రజలు పోలీసుల కళ్ళుగప్పి రాయచోటి ముస్లిం సోదరుల్లో కలిసిపోయి అనుమానం రాకుండా జీవించడాన్ని పోలీసు వర్గాలు నెగ్గుతేల్చడం తెలిసిందే.