ఏఐ సదస్సును సిగ్గులేని రాజకీయాలకు వేదికగా మార్చిన కాంగ్రెస్

ఏఐ సదస్సును సిగ్గులేని రాజకీయాలకు వేదికగా మార్చిన కాంగ్రెస్

డిల్లీలో నిర్వహించిన ప్రపంచస్థాయి ఏఐ సదస్సును కాంగ్రెస్‌ పార్టీ మురికి, సిగ్గులేని రాజకీయాలకు వేదికగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదస్సులో కాంగ్రెస్‌ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శనలు చేయడంపై స్పందించిన మోదీ, దేశానికి ఆ పార్టీ నిజస్వరూపం తెలుసని, మళ్లీ బట్టలు విప్పాల్సిన అవసరం ఏంటని ఎద్దేవా చేశారు. 

ఆదివారం ఉత్తర్​ప్రదేశ్​లోని మేరఠ్‌ మెట్రో, నమో భారత్‌ కారిడార్‌ను ప్రారంభించారు. అలాగే రూ. 12,930 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ  ప్రపంచం ముందు దేశం పరువు తీస్తున్నారని పేర్కొంటూ భారతదేశం గ్లోబల్ టెక్ హబ్‌గా ఎదుగుతున్న తరుణంలో, ఇటువంటి చర్యలు దేశ ప్రతిష్ఠను దిగజార్చుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

“కాంగ్రెస్ నాయకులు మోదీని ద్వేషిస్తారు. వారు నా సమాధిని తవ్వాలని చూస్తున్నారు. నా తల్లిని అవమానించడానికి కూడా వెనుకాకడరు. ఏఐ గ్లోబల్ సమ్మిట్ బీజేపీ కార్యక్రమం కాదు. ఆ సమ్మిట్​కు ఏ బీజేపీ నాయకుడు హాజరు కాలేదని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలి. ఇది దేశం గర్వించే పని. కానీ కాంగ్రెస్ జాతీయ గౌరవాన్ని ఉల్లంఘించింది. కాంగ్రెస్ ఈ అవినీతి విధానాన్ని దేశం మొత్తం ఖండిస్తోంది” అంటూ ప్రధాని ధ్వజమెత్తారు. 

“ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పుడు భారత్​తో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకున్నప్పటికీ, అభివృద్ధి చెందిన దేశాలతో ఒప్పందాలు చేసుకోలేకపోయాయి. ఎందుకంటే అప్పట్లో, స్కామ్‌లకు పేరుగాంచిన కాంగ్రెస్ ప్రభుత్వంతో వ్యవహరించడానికి ప్రపంచం సంకోచించింది. కానీ నేడు, అభివృద్ధి చెందిన దేశాలు భారత్​తో వాణిజ్యం చేసేందుకు ఆసక్తిగా ఉన్నాయి. ఇప్పుడు 21వ శతాబ్దపు సవాళ్లకు పరిష్కారాలను అందించగల శక్తి భారత్ అని ప్రపంచం భావిస్తోంది” అని ప్రధాని మోదీ తెలిపారు.

కాంగ్రెస్‌- సమాజ్‌వాదీ పాలనలో మౌళికసదుపాయాల కుంభకోణాల వల్ల అభివృద్ధి కుంటుపడిందని ప్రధాని మోదీ విమర్శించారు. మెట్రో సంబంధిత సాంకేతిక పరిజ్ఞానాన్ని చాలా వరకు దిగుమతి చేసుకోవాల్సి వచ్చిందని, దానితో  కాంగ్రెస్‌ హయాంలో దేశంలో మెట్రో సేవలు 5 నగరాలకే పరిమితమై ఉండేవని, ఇప్పుడు అవి 25 నగరాలకు పైగా విస్తరించాయని వివరించారు. 

 
బీజేపీ వచ్చాక శాంతిభద్రతలు మెరుగుపడ్డాయని, స్థానికులు సహా పెట్టుబడిదారుల్లో అవి విశ్వాసాన్ని నింపాయని, కుంభకోణాలను ఆపడమే కాకుండా దేశాన్ని స్వావలంబన మార్గంలో ముందుకు తీసుకెళ్లామని ప్రధాని  చెప్పారు. ప్రజలకు సౌకర్యవంతమైన సదుపాయాలను అందిచడమే లక్ష్యంతోనే గత 11 సంవత్సరాలుగా బీజేపీ పని చేసిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 
 
అందుకే మెట్రోల సేవలు డజన్ల కొద్దీ నగారలను చేరుకున్నాయని, ఇప్పుడు ప్రపంచంలోనే భారత్‌ మూడో అతిపెద్ద మెట్రోట్రైన్ నెట్వర్క్‌ను కలిగి ఉందని ప్రధాని మోదీ తెలిపారు.  ఉత్తర్‌ప్రదేశ్‌లోని శతాబ్ది నగర్‌ స్టేషన్‌ నుంచి ఈ మేరఠ్‌ మెట్రో, నమో భారత్‌ రైళ్లను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. దేశంలో తొలిసారి 120కిలోమీటర్ల వేగంతో ప్రారంభమైన మెట్రో సర్వీసు ఇది.  హైస్పీడ్ ఇంటర్‌సిటీ ప్రయాణం ఉద్యమానికి ఈ చర్య కీలక ముందడుగు కానుంది. 
ఈ సందర్భంగా 82 కిలోమీటర్ల డిల్లీ మీరట్ నమో భారత్ కారిడార్‌ను ప్రధాని జాతికి అంకితం చేశారు. భారత్‌లోని తొలి నమో భారత్ ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ సెక్షన్‌లను ప్రారంభించారు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో నమో భారత్ భారత తొలి ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థ. రైళ్లను ప్రారంభించిన తర్వాత ఉత్తర్​ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి మోదీ మేరఠ్‌ సౌత్ స్టేషన్ వరకు మెట్రోలో పర్యటించారు. మెట్రోలో ఉన్న విద్యార్థులు, అధికారులతో ప్రధాని ముచ్చటించారు.