జగిత్యాల జిల్లాలో కుల బహిష్కరణ అంటూ తప్పుడు ప్రచారం

జగిత్యాల జిల్లాలో కుల బహిష్కరణ అంటూ తప్పుడు ప్రచారం

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంట గ్రామంలో గ్రామ పెద్దలు  ఎదుల రాజేశం కుటుంబాన్ని కుల బహిష్కరణ కావించారని,  ఎదుల రాజేశం అనే వ్యక్తిమృతి చెందగా అతని పాడె మోయకూడదని గ్రామ సర్పంచ్, కుల పెద్దలు ఆఙ్ఞాపించారని అంటూ ఇటీవల ఓ కధనం వ్యాప్తిచెంది కలకలం రేపింది.  అతని మృతదేహాన్ని ముట్టుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో, భార్య, అక్కలు, సొంత కుటుంబ సభ్యులు కలిసి పాడే మోయాల్సి వచ్చింది అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా  ప్రచారం జరిగింది.

ఈ సంఘటన విషయమై నిజానిజాలు తెలుసుకోవటానికి జగిత్యాల జిల్లా సామాజిక సమరసతా వేదిక  ప్రతినిధులు ఆ గ్రామాన్ని సందర్శించి వాస్తవాలను సేకరించగా అదంతా అభూతకల్పన అని స్పష్టమైంది.  సంఘటనకు కారణమని చెబుతున్న  సర్పంచ్  కొమిరె నర్సయ్యని, చనిపోయిన వ్యక్తి   ఏదుల రాజేశం కుటుంబ సభ్యులను కలసి విచారించగా  చనిపోయిన వ్యక్తి కుటుంబం, సర్పంచ్ అంతా కూడా దగ్గరి బంధువులే అని వెల్లడైంది.

చనిపోయిన వ్యక్తి ఏదుల రాజేశంకు మామ వరస అయ్యే  కొమిరె  పోచయ్య అతనికి సంబంధించి ఆ గ్రామంలో కొంత వివాదం నెలకొని ఉండడంతో అనారోగ్యం కారణంగా చనిపోయిన సమయంలో ఆ వ్యక్తితో జరిగిన  వాగ్వివాదం సందర్భంగా ఆ శవాన్ని దహన సంస్కారాలకు తాను ఒక్కడినే తీసుకుని వెళ్తానని సర్పంచ్ గ్రామస్తులతో గొడవపడిన్నట్లు తెలిసింది.  ఆ శవాన్ని కుటుంబ సభ్యులతో కలిసి తీసుకెళ్లాడు తప్ప ఆ కుటుంబాన్ని సర్పంచ్ గాని, గ్రామ పెద్దలు గానీ బహిష్కరించడం జరగలేదు.

పైగా చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులకు సర్పంచ్ ఆర్థికంగా కూడా సహాయం చేశారు.  జరిగిన ఈ సంఘటనను గతంలో రిపోర్టర్ గా పనిచేసి ప్రస్తుతం  ఉపాధి నిమిత్తం విదేశాల్లో ఉన్న ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తి  ఏదుల  శంకర్  భార్య ఈ విషయాన్ని అతనికి తెలుపగా అతడు దాన్ని తప్పుగా  ప్రచారం చేయగా  ఆ వీడియో వైరల్ కావడం జరిగిందని వెల్లడైంది.  ఈ విషయానికి సంబంధించి అధికారులు కూడా గ్రామాన్ని సందర్శించి విచారణ చేశారు.  తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేసినట్లు సర్పంచ్, చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.