అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు ఆదేశ సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వివిధ దేశాలపై విచ్చల విడిగా విధించిన టారీఫ్‌లను కొట్టివేసింది. అమెరికా అధ్యక్షుడికిగానీ, వైట్‌హౌస్‌కుగానీ ప్రపంచదేశాలపై టారీఫ్‌లు విధించే అధికారం లేదని స్పష్టం చేసింది. ట్రంప్ తన అధికారాలను అతిక్రమించి టారీఫ్‌లు విధించారని, అది చట్టవిరుద్ధమని, చట్ట విరుద్ధ ఆదేశాలు చెల్లవని పేర్కొంది.
అంతేకాకుండా ఇప్పటి వరకు వివిధ దేశాల నుండి అదనంగా వసూలు చేసిన సుంకాలను ఆ దేశాలకు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం ఇచ్చిన తీర్పు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు బెంచ్‌లో తొమ్మిది మంది జడ్జిల ఉండగా, ఆరుగురు టారీఫ్‌ల విషయంలో ట్రంప్‌నకు వ్యతిరేకంగా, ముగ్గురు అనుకూలంగా పేర్కొన్నారు. దీంతో 6-3తో మెజార్టీ తీర్పును సుప్రీం కోర్చు ఇచ్చినట్టైంది.
సుప్రీం తీర్పు వెలువడిన సమయంలో దాదాపు 20 రాష్ట్రాల గవర్నర్లతో ట్రంప్ సమావేశమై ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామంపై న్యాయమూర్తులపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మూర్ఖులు.. లాప్‌డాగ్‌లు’’ అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కోర్టు సిబ్బంది తీరును చూసి సిగ్గుపడుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ క్రమంలో మరోసారి ట్రంప్ తన ప్రతాపాన్ని చూపించారు. అన్ని దేశాలపై 10 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఓవల్ కార్యాలయం నుంచి కొత్త కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేసి సోషల్ మీడియాలో వెల్లడించారు. కొత్త ఉత్తర్వు ప్రకారం అన్ని దేశాల నుంచి దిగుమతులపై 10 శాతం సుంకం విధించినట్లు పేర్కొన్నారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని రాసుకొచ్చారు.
అత్యవసర పరిస్థితుల కోసం రూపొందించిన 1977 నాటి అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక శక్తుల చట్టం (ఐఇఇపిఎ ) చట్టాన్ని ఉపయోగించి విధించిన ఈ టారిఫ్‌లను న్యాయస్థానం తప్పుబట్టింది. ఆ చట్టం ప్రకారం అటువంటి అధికారం అధ్యక్షుడికి లేదని పేర్కొంది. టారీఫ్‌లతో పాటు పన్నులు విధించే అధికారం అమెరికన్ కాంగ్రెస్ (పార్లమెంటు)కు మాత్రమే ఉందని స్పష్టం చేసింది.
అమెరికన్ రాజ్యాంగంలో ఈ విషయం స్పష్టంగా ఉందని, రాజ్యాంగం ప్రకారం ఏ కార్యనిర్వాహక విభాగానికి కూడా ఆ బాధ్యతను అప్పగించలేదనిచీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ తన తీర్పులో పేర్కొన్నారు. అధ్యక్షుడు అసాధారణ అధికారాన్ని వినియోగించాలంటే, పార్లమెంటు నుండి స్పష్టమైన అనుమతి పొందాలన్నారు. ట్రంప్ టారిఫ్‌లతో భారత్‌తో సహా వివిధ దేశాల నుండి డిసెంబర్‌నాటికి 133 బిలియన్ డాలర్లు అమెరికాకు వసూలైనట్లు సమాచారం.
మరో విశ్లేషణ ప్రకారం ఈ మొత్తం 175 బిలియన్ డాలర్ల దాకా ఉంది. సుప్రీం తీర్పుతో ఆ మొత్తాన్ని వివిధ దేశాలకు తిరిగి చెల్లించాల్సిఉంది. అధ్యక్షుడు సుంకాలు విధించడానికి ఉపయోగించిన చట్టంలో సుంకాలు అనే పదం గురించి ప్రస్తావించలేదని ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేసిన రాష్ర్టాలు, ప్రైవేట్ సంస్థల తరఫు న్యాయవాదులు వాదించారు.
పన్ను విధించే తన అధికారాలను కాంగ్రెస్ అప్పగించలేదని, లేదా ఇతర వాణిజ్య ఒప్పందాలు, సుంకాల నిబంధనలను పక్కనపెట్టడానికి అధ్యక్షుడికి పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని ఉద్దేశించలేదని వారు వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న జడ్జిలు దేశాధ్యక్షుడి నిర్ణయం చట్ట విరుద్ధమని సుంకాలను కొట్టేసింది. కాగా, సుప్రీంకోర్టు తీర్పు గత సంవత్సరం ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశం నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై ట్రంప్ విధించిన సుంకాలకు వర్తిస్తుంది.
ఇతర దేశాలకు విస్తరించే ముందు మొదట మెక్సికో, కెనడా, చైనాలను లక్ష్యంగా చేసుకుని ఏప్రిల్‌లో విముక్తి దినోత్సవం నాడు సుంకాల విధింపునకు ట్రంప్ శ్రీకారం చుట్టారు. అత్యవసర పరిస్థితికి ప్రతిస్పందనగా వాణిజ్యాన్ని నియంత్రించే అధికారాన్ని అధ్యక్షుడికి ఇచ్చే 1977 చట్టం అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం(ఐఈఈపీఏ) ఉపయోగించి ఈ సుంకాలు సమర్థనీయమేనని ట్రంప్ వాదిస్తూ వచ్చారు.
అధికంగా వసూలు చేసిన టారీఫ్‌లను తిరిగి చెల్లించాలని ఆదేశించినప్పటికీ, ఏ పద్దతిలో చెల్లించాలన్న విషయమై అమెరికన్ సుప్రీంకోర్టు ఎటువంటి మార్గదర్శకాలు ఇవ్వలేదు. దీనిని అవకాశంగా తీసుకుని తీవ్ర జాప్యం చేయడంతో పాటు, సుప్రీం తీర్పు అమలు కాకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతారని భావిస్తున్నారు.
నిజానికి వైట్‌హౌస్ తీర్పువెలువడిన వెంటనే ఆ దిశలో ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరోవైపు వివిధ దేశాలకు చెందిన కంపెనీలు తాము అధికంగా చెల్లించిన మొత్తాలకు ఆధారాలు చూపుతూ అమెరికన్ కోర్టులలో విడివిడిగా దావాలు వేయాల్సి వస్తుందని కూడా చెబుతున్నారు.

More Stories
ప్రధాని మోదీ వెళ్లిపోగానే ఇరాన్‌పై దాడికి నిర్ణయం
యుద్ధ నౌకలు పంపేందుకు ఆస్ట్రేలియా, జపాన్ ట్రంప్ కు మొండిచేయి
కటక్ హాస్పిటల్లో భారీ అగ్నిప్రమాదం, 10 మంది మృతి