బీఎల్ఏ నిర్బంధించిన సైనికులు తమ వాళ్లే కాదంటున్న పాక్

బీఎల్ఏ నిర్బంధించిన సైనికులు తమ వాళ్లే కాదంటున్న పాక్
పాకిస్తాన్ సైన్యానికి, బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) కి మధ్య నడుస్తున్న సైనికుల కిడ్నాప్ అంశం కీలక మలుపు తిరిగింది. బీఎల్ఏ ఆధీనంలో ఉన్న సైనికులు తమ వాళ్లు కాదని పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. దీంతో బీఎల్ఏ చెరలో ఉన్న పాక్ సైనికులు తమ ఐడీలు చూపించారు. పాక్ ఆర్మీ తమను పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
జనవరి చివరి వారంలో పాక్ సైన్యంపై బీఎల్ఏ మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో పాక్ సైనికులు, బీఎల్ఏ సభ్యులు కూడా మరణించారు. రెండువైపులా కొందరినీ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ దాడుల సందర్భంగా బీఎల్ఏ సభ్యుల్ని పాక్ ఆర్మీ అరెస్ట్ చేస్తే కొందరు పాక్ సైనికుల్ని బీఎల్ఏ కిడ్నాప్ చేసింది. 
తమ ఆధీనంలో ఏడుగురు పాక్ సైనికులు ఉన్నట్లు ఇటీవల బీఎల్ఏ ప్రకటించింది.
బంధీలుగా ఉన్న పాకిస్తాన్ సైనికులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కూడా విడుదల చేసింది. వారిని విడుదల చేయాలంటే పాకిస్తాన్ ఆర్మీ అరెస్టు చేసిన తమ వారిని విడుదల చేయాలని బీఎల్ఏ డిమాండ్ చేసింది. లేకుంటే తమ ఆధీనంలో ఉన్నవారిని చంపేస్తామని హెచ్చరించింది.  ఇందుకు ఈ నెల 22 వరకు గడువిచ్చింది. అయితే, ఈ విషయంలో పాకిస్తాన్ భిన్నంగా స్పందించింది. తమ సైనికులకు సంబంధించి ఎవరూ తప్పిపోలేదని  తెలిపింది.
అంతేకాదు బీఎల్‌ఏ ఆధీనంలో ఉన్నవారు తమ సైనికులే కాదని తేల్చిచెప్పింది. దీంతో బంధీలుగా ఉన్న పాక్ సైనికులు షాకయ్యారు. తమకు సంబంధించిన ఐడీలు చూపిస్తూ వీడియో విడుదల చేశారు.  ఈ ఐడీ కార్డు పాక్ ప్రభుత్వమే జారీ చేసిందని స్పష్టం చేశారు. తాము పాక్ సైనికులం కాకుంటే మరెవరని ప్రశ్నించారు. తమ కుటుంబ పరిస్థితి గురించి వివరించారు. తాము దేశం కోసం ప్రాణాలిచ్చేందుకు సిద్ధమైతే తమ దేశం కనీసం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశం చివరకు ఎటు వెళ్తుందో చూడాలి.