బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ విజయంలో భారత్ పాత్ర!

బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ విజయంలో భారత్ పాత్ర!
బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ విజయం సాధించడంలో భారత్ తోపాటు, మాజీ ప్రధాని షేక్ హసీనా పాత్ర ఉందని నేషనల్ సిటిజన్స్ పార్టీ (ఎన్సీపీ) అధినేత నహీద్ ఇస్లాం ఆరోపించారు. నహీద్ గతంలో షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. ఆమెను పదవినుంచి దించడంలో పోరాటం చేశారు. ఆ ఇమేజ్‌తోనే 2025 ఫిబ్రవరిలో ఎన్సీపీని స్థాపించాడు. 
 
ఇటీవల జరిగిన జాతీయ ఎన్నికల్లో జమాతే ఇస్లామి పార్టీతో కలిసి కూటమిగా పోటీ చేశారు. 297 సీట్లకు జరిగిన ఎన్నికల్లో బీఎన్‌పీ 212 సీట్లతో అధికారం దక్కించుకుంది. జమాతే 68 సీట్లు గెలుచుకోగా, ఎన్సీపీ ఆరు సీట్లకే పరిమితమైంది. ఈ ఎన్నికల తర్వాత నహీద్ ప్రతిపక్షంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రతిపక్ష విప్‌గా కూడా ఎన్నికయ్యాడు. 
 
ఇక ఈ ఎన్నికల్లో తన పార్టీతోపాటు జమాతే ఓడిపోవడంపై స్పందిస్తూ భారత్ తోపాటు, షేక్ హసీనా పార్టీ అయిన అవామీ లీగ్ సహకారంతోనే బీఎన్‌పీ గెలిచిందని, ఎన్నికల ఫలితాలను భారత్ ప్రభావితం చేసిందని ఆరోపించారు. భారత్, అవామీ లీగ్, బీఎన్‌పీ మధ్య కుదిరిన ఒప్పందం మేరకే తాజా ఫలితాలు వెలువడ్డాయని చెప్పారు. 
అవామీ లీగ్ ఆఫీసుల్ని ఇటీవల బీఎన్‌పీ నేతలు ప్రారంభించడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు.
ఎన్నికల్లో మోసాలకు పాల్పడటం, ఎలక్షన్ ఇంజినీరింగ్ వల్లే బీఎన్‌పీ గెలిచిందని ఆరోపించారు.  తన ఓటు బ్యాంకు కోసం  అవామీ లీగ్ మరింతగా పునరావాసం కల్పించడానికి ప్రయత్నాలు జరిగితే ప్రజలు ప్రతిఘటిస్తారని ఆయన హెచ్చరించారు. “అవామీ లీగ్ ని ఎదుర్కోవడంలో విఫలమైతే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది.  ఆ పార్టీ పునరావాసం జరిగితే మేము రాజకీయ ప్రతిఘటనకు పిలుపునిస్తాము” అని ఆయన స్పష్టం చేశారు.

 
కొనసాగుతున్న విచారణలు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా జిల్లాలు,  ఉపజిల్లాలలో అవామీ లీగ్ కార్యాలయాలు తిరిగి తెరుస్తున్నారని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన మంత్రివర్గాన్ని విమర్శిస్తూ, అది అందరిని కలుపుకొని పోవడం లేదా ప్రాతినిధ్యం వహించడం లేదని నహిద్ విమర్శించారు. మహిళలు, మైనారిటీలకు నిజమైన ప్రాతినిధ్యం లేదని ధ్వజమెత్తారు. 
 
మంత్రివర్గం సగటు వయస్సు 60 సంవత్సరాలు అని, ఇది యువత నడిచే బంగ్లాదేశ్‌ను ప్రతిబింబించదని స్పష్టం చేశారు. పైగా,  62% మంది క్యాబినెట్ సభ్యులు వ్యాపారవేత్తలు కావడంతో వారు ప్రజా ప్రయోజనాల కంటే తమ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.క్యాబినెట్ సభ్యులలో ఎక్కువ మంది రుణ ఎగవేతదారులని,  18,000 కోట్ల రుణాలతో బకాయి పడ్డారని, 2001-2006 నుండి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వారిని ఇప్పుడు చేర్చారని ధ్వజమెత్తారు.