భారతీయులకు బంగ్లా వీసా సేవల పునరుద్ధరణ

భారతీయులకు బంగ్లా వీసా సేవల పునరుద్ధరణ

బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తారిఖ్ రహమాన్ బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు భారతీయులకు జారీ చేసే వీసా సేవల్ని పునరుద్ధరించారు.ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయంలో ఈ సేవలు శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. రెండు దేశాల మధ్య వీసాల జారీ రెండు నెలల క్రితం నిలిచిపోయింది. మూడు నెలల క్రితం బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరిగాయి. అలాగే భారత్ లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లా డిమాండ్ చేసింది.

ఈ పరిణామాల నేపథ్యలో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. దీంతో గత ఏడాది డిసెంబర్ నుంచి రెండు దేశాల మధ్య రాయబార కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయి.  ముఖ్యంగా రెండు దేశాల మధ్య వీసాల జారీ ఆగిపోయింది. ఇటు ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయంలో, అటు ఢాకాలోని భారత రాయబార కార్యాలయంలో వీసాల జారీ నిలిచిపోయింది.

అయితే, తాజాగా బంగ్లా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తారిఖ్ రహమాన్ మూడు రోజుల్లోనే భారత్ తో సంబంధాల విషయంలో సానుకూలంగా స్పందించారు. వీసాలు పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఢిల్లీలో శుక్రవారం ఉదయం నుంచి బంగ్లా రాయబార కార్యాలయంలో అన్ని రకాల వీసాల మంజూరు సేవలు ప్రారంభమయ్యాయి.

త్వరలోనే ఢాకాలో కూడా బంగ్లా నుంచి భారత్ కు వచ్చేందుకు వీసాల సేవల్ని పునరుద్ధరిస్తామని అనిరుద్ధా దాస్ అనే బంగ్లాలోని భారత రాయబార కార్యాలయ అధికారి తెలిపారు. మెడికల్, టూరిజం వంటి అన్ని రకాల వీసా సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇలా ఉండగా, ఢాకాలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బంగ్లాదేశ్‌తో బహుముఖ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భారత్ ఎదురుచూస్తోందని, పొరుగు దేశంలో ప్రజాస్వామ్య,సమ్మిళిత రాజకీయ ప్రక్రియకు మద్దతు ఇవ్వాలని భారత్ కోరుతోందని భారత్ తెలిపింది.

బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత ప్రశ్నలకు సమాధానమిస్తూ, బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి తారిఖ్ రెహమాన్ ఎన్నికల విజయం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ   ఆయనను అభినందించారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గుర్తు చేశారు. రెండు దేశాల మధ్య చారిత్రాత్మకంగా సన్నిహిత సంబంధాలను పెంచుకోవాలని, కొత్త పరిపాలనతో సన్నిహితంగా ఉండాలని న్యూఢిల్లీ ఉద్దేశించిందని ఆయన పేర్కొన్నారు.

“బంగ్లాదేశ్‌తో మా బహుముఖ ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి, సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కొత్త ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండటానికి మేము ఎదురుచూస్తున్నాము” అని ఆయన చెప్పారు. నిరంతర దౌత్య సంబంధాలలో భాగంగా ఢాకాతో ద్వైపాక్షిక సంబంధాల అన్ని అంశాలను చర్చించడానికి భారతదేశం తన సంసిద్ధతను తెలియజేసిందని ప్రతినిధి తెలిపారు.