* “సిగ్గులేని” చర్య అంటూ నెటిజన్ల మండిపాటు
న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగుతున్నఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సులో గందరగోళం చెలరేగింది. భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమ్మిట్ వద్ద యువజన కాంగ్రెస్ నాయకులు ఆందోళనలకు దిగారు. షర్టులు విప్పి ఒక్కసారిగా దూసుకొచ్చారు. వేదికలోని ఓ హాలు బయట నినాదాలు వినిపించినట్టు సమ్మిట్‌లో ఉన్నవారు తెలిపారు.
ఏమి జరిగిందో చూసేందుకు వెళ్లిన సమయంలో యూత్ కాంగ్రెస్ నాయకులు అక్కడ నిరసన చేస్తున్నారని చెప్పారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో షరతులకు ప్రభుత్వం తలొగ్గిందని ఆరోపించారు. వాణిజ్య ఒప్పందం వల్ల భారత్‌కు ఎటువంటి ప్రయోజనం ఒనగూరదని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ముందునుంచి ఆరోపిస్తోంది.
సదస్సులోని ఒక వేదిక వద్దకు చేరుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా గట్టిగా నినాదాలు చేశారు.
ఇండియా-యూఎస్ డీల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిలో భాగంగా అందరూ తమ షర్ట్స్ విప్పి నిరసన తెలిపారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా నిర్భయంతో తమ కార్యకర్తలు నిరసన తెలిపారని, వాణిజ్య ఒప్పందం ద్వారా ప్రధాని మోదీ దేశం విషయంలో కాంప్రమైజ్ అయ్యారని కాంగ్రెస్ ఆరోపించింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అంతర్జాతీయ సదస్సులో ఇలా కాంగ్రెస్ నేతలు ప్రవర్తించడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.దేశానికి కీలకంగా మారిన ఈ సదస్సులో ఇలా ఆందోళన చేయడమేంటని కొందరు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు స్పందించారు. వేదిక వద్ద ఆందోళన చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
యూత్ కాంగ్రెస్ నిరసనపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఏఐ సదస్సును అడ్డుకోవాలనే కాంగ్రెస్ ప్రయత్న. దేశ అభివృద్ధి కథనంపై ఆ పార్టీకున్న అసూయ ఫలితమని మండిపడింది. కాంగ్రెస్‌కే ఏఐ అంటే యాంటీ-ఇండియా అని బీజేపీ అధికార ప్రతినిధి నళిన్ కోహ్లీ విమర్శించారు. ‘ఐఎన్‌సీ అనేది వాస్తవానికి ఏఎన్సీ లేదా యాంటీ నేషనల్ కాంగ్రెస్ అని నిరూపించుకుంది.. ఆందోళన చేస్తున్నవారికి షర్టులే కాదు వ్యక్తిత్వం కూడా లేదు’ అని దుయ్యబ్టటారు.
“సిగ్గులేని” చర్య ప్రపంచ వేదికపై దేశాన్ని అవమానించే ప్రయత్నం అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశ ప్రతిష్టను “కళంకీకరించే” చర్యలో పాల్గొన్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని చాలామంది డిమాండ్ చేశారు. “ఇది సిగ్గులేనితనం, మొరటుతనం, అజ్ఞానం, దేశాన్ని కూడా అవమానించే ప్రయత్నం… దేశంలోని రోడ్లు సరిపోలేదా??? లేదా ఎజెండా ప్రతిపక్షం కాదు, కేవలం పరువు నష్టం మాత్రమేనా???” అని ఒకరు రాశారు.

More Stories
పాక్స్ సిలికా కూటమిలో చేరిన భారత్
ఏడాదిలో హామీల అమలులో రేఖ గుప్తా ప్రభుత్వం ముందడుగు
త్వరలో తెలుగు రాష్ట్రాలతో సహా 22 రాష్ట్రాల్లో ‘సర్’