మార్చి రెండో వారంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

మార్చి రెండో వారంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణలో బడ్జెట్‌ సమావేశాలు మార్చి రెండో వారంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికలు మార్చి 16న ఉండటం, ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు అంతా భాగస్వామ్యం కావాల్సి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అప్పటికీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగేటట్లు పదో తేదీ తర్వాత బడ్జెట్ సమావేశాలు ప్రారంభించే దిశగా సర్కారు కసరత్తు జరుగుతోంది. 

2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ సమావేశాలను పది నుంచి పదిహేను రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే బడ్జెట్‌ సమావేశాల మొదటి రోజున జరిగే బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు కొనసాగాలన్న దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ నెల 23న మంత్రిమండలి సమావేశం జరగనుంది. భేటీ అనంతరం రైతు భరోసా అమలు తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

కేబినెట్ సమావేశంలో బడ్జెట్‌ సమావేశాల నిర్వహణకు ఆమోదం తెలుపుతూ కేబినెట్‌ తేదీ ఖరారు చేసే అవకాశం ఉంది.  ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఇప్పటికే బడ్జెట్‌ సన్నాహక సమావేశాలను వరుసగా నిర్వహిస్తున్నారు. శాఖల వారీగా జరుగుతున్న ఈ సమావేశాల్లో ఆయా విభాగాలకు కేటాయించిన నిధులు, ఖర్చు చేసిన మొత్తం, రాబోయే బడ్జెట్‌లో విజన్‌–2047 లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన నిధులపై చర్చిస్తున్నారు. 

వచ్చే నెల పదో తేదీ తర్వాత బడ్జెట్‌ సమావేశాలు జరిగే అవకాశం ఉండడంతో అప్పటి వరకు మొత్తం బడ్జెట్‌ తయారీ ప్రక్రియ పూర్తవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రసంగిస్తారు. అనంతరం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రెండు రోజుల పాటు చర్చ జరిగిన అనంతరం ఆమోదం లభిస్తుంది. 

తరువాత ఒకటి లేదా రెండు రోజుల విరామం ఇచ్చి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. బడ్జెట్‌పై రెండు నుంచి మూడు రోజులపాటు చర్చ జరిగే అవకాశం ఉంది. అనంతరం శాఖల వారీగా పద్దుల కేటాయింపులు, ప్రజా సమస్యలపై మూడు నుంచి నాలుగు రోజులపాటు చర్చ కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత ద్రవ్య వినియోగ బిల్లును ప్రవేశపెడతారు.

ఈసారి బడ్జెట్‌లో ఆరు గ్యారెంటీల అమలు, రైతు సంక్షేమం, ఇందిరమ్మ ఇళ్లు తదితర అంశాలకు ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. మార్చి నాలుగో వారం నాటికి బడ్జెట్‌ సమావేశాలు ముగిసే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సమావేశాల వ్యవధిపై తుది నిర్ణయం బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ తీసుకోనుంది.