ఓటరు జాబితాకు సంబంధించి దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) నిర్వహించనున్నఎన్నికల కమిషన్ ఆ దిశగా సన్నాహాక పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రెండు తెలుగు రాష్ట్రాలతో సహా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. ఏప్రిల్ నుంచి ఎస్ఐఆర్ మొదలయ్యే అవకాశం ఉంది. 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్ పూర్తయితే దేశమంతా ఆ ప్రక్రియ సంపూర్ణమవుతుంది.
ఎస్ఐఆర్ ప్రక్రియ బిహార్లో పూర్తి కాగా మరో 9 రాష్ట్రాల్లో కొనసాగుతోంది. అసోంలో ఎస్ఐఆర్ స్థానంలో నిర్వహించిన ఎస్ఆర్ ఈనెల 10న పూర్తయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. మూడోదశలో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, దాద్రా నాగర్ హవేలీ, డామన్ డయ్యూ, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, ఝార్ఖండ్, కర్ణాటక, లద్ధాఖ్, మహారాష్ట్ర, మణిపుర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, దిల్లీ, ఒడిశా, పంజాబ్, సిక్కిం, త్రిపుర, తెలంగాణ, ఉత్తరాఖండ్లో ఎస్ఐఆర్ను నిర్వహించనున్నారు.
ఈ విషయంపై ప్రధాన ఎన్నికల అధికారులకు రాసిన లేఖలో, పాన్-ఇండియా ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ ని గత సంవత్సరం జూన్లో ఆదేశించినట్లు పోల్ అథారిటీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉండగా, బిహార్లో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తికాగా, తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రక్రియ కొనసాగుతోంది. కొద్దిరోజుల క్రితం, బంగాల్లో నిర్వహిస్తోన్న ఎస్ఐఆర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది.
ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం సర్ ప్రక్రియలో ఏవైనా ఆదేశాలు, స్పష్టత అవసరమైతే తాము జోక్యం చేసుకుంటామని తెలిపింది. అంతేకానీ ఎస్ఐఆర్ కసరత్తులో అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు చేయవద్దని బంగాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాలు అర్థం చేసుకోవాలని పేర్కొంది.
ఈ మేరకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చి, జస్టిస్ ఎన్వీ అంజారియా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. మరోవైపు, ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం దాదాపు 300మంది అధికారులను కేటాయించాలని బంగాల్ ప్రభుత్వాన్ని కోరితే, కేవలం 80 మంది గ్రేడ్-2 స్థాయి అధికారులనే కేటాయించిందని న్యాయస్థానానికి ఎన్నికల కమిషన్ తెలిపింది.
‘సర్’లో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటికీ తిరిగి ఓటర్లను గుర్తిస్తారు. ఆ ఇంట్లో ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఆధార్ వంటి ధృవపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తమ వివరాలు సమర్పించి ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. సరైన డాక్యుమెంట్లు లేని ఓట్లను తొలగిస్తారు.

More Stories
ఏడాదిలో హామీల అమలులో రేఖ గుప్తా ప్రభుత్వం ముందడుగు
కుత్రిమ మేధలో దేశ భవిష్యత్ చూస్తున్నాం
భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ వీసా ప్రక్రియ సులభతరం