ఉచిత పథకాల వల్ల రాష్ట్రాల అభివృద్ధికి విఘాతం

ఉచిత పథకాల వల్ల రాష్ట్రాల అభివృద్ధికి విఘాతం
వివిధ రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌క‌టిస్తున్న ఉచిత ప‌థ‌కాల‌పై సుప్రీంకోర్టు ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఆ సంస్కృతిని అత్యున్న‌త న్యాయ‌స్థానం త‌ప్పుప‌ట్టింది. రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌క‌టించే ఉచిత స్కీమ్‌ల‌తో ఆర్థిక వృద్ధికి ఆటంకం ఏర్ప‌డుతుంద‌ని సుప్రీంకోర్టు చెప్పింది. చీఫ్ జ‌స్టిస్ సూర్య‌కాంత్‌, జ‌స్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి, విపుల్ పంచోలితో కూడిన ధ‌ర్మాస‌నం ఈ వ్యాఖ్య‌లు చేసింది. 
 
తాజాగా త‌మిళ‌నాడులోని విద్యుత్తు బోర్డు ఉచిత విద్యుత్తు ప్ర‌క‌ట‌న చేసిన నేప‌థ్యంలో ఆ అంశాన్ని కోర్టు సీరియ‌స్‌గా తీసుకున్న‌ది. ఆర్థిక ప‌రిస్థితిని ప‌ట్టించుకోకుండా, వినియోగ‌దారుల‌కు ఎలా ఉచిత విద్యుత్తును అందిస్తార‌ని త‌మిళ‌నాడు ఎల‌క్ట్రిసిటీ బోర్డును కోర్టు ప్ర‌శ్నించింది.  చాలా వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆదాయ‌లోటుతో ఉన్నాయ‌ని, కానీ అభివృద్ధి గురించి ఆలోచించ‌కుండా ఉచితాలు ప్ర‌క‌టిస్తున్నాయ‌ని కోర్టు పేర్కొన్న‌ది.
 
తమిళనాడు ప్రభుత్వ తరఫున సీనియర్ అడ్వకేట్ గోపాల్ సుబ్రమణియం వాదనలు వినిపించగా, బిల్లు చెల్లించలేని పేదలకు సహాయం చేయడం అర్థవంతమైన చర్య అని, కానీ, కానీ ఆర్థిక స్థోమత ఉన్నవారికీ, లేనివారికీ తేడా లేకుండా ఉచితాలు ఇవ్వడం సరైందా? అంటూ సీజేఐ ప్రశ్నించారు.  ఈ మేరకు తమిళనాడు విద్యుత్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. 
రాష్ట్రాలు అప్పుల్లో ఉండి కూడా డబ్బు పంపిణీ చేయడంపై సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిధులను సాగునీరు, విద్యుత్ వంటి దీర్ఘకాలిక అభివృద్ధి పనులకు ఎందుకు కేటాయించకూడదని అడిగారు. నగదు బదిలీ విధానాలపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఉచిత ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డం వ‌ల్ల దేశ ఆర్థిక అభివృద్ధికి ఆటంకం ఏర్ప‌డుతుంద‌ని కోర్టు చెప్పింది. ఉచితంగా ఆహారం, సైకిళ్లు, విద్యుత్తుల‌ను ఇవ్వడం క‌న్నా ఉద్యోగ ఉపాధి అవ‌కాశాల క‌ల్ప‌న‌పై దృష్టి పెట్టాల‌ని కోర్టు పేర్కొన్న‌ది.
ఉచిత విద్యుత్తు ఇచ్చే అంశంలో డీఎంకే ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన పిటీష‌న్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు ఇచ్చింది. రాష్ట్రాలు ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా పనిచేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అన్నీ ఉచితంగా పంచుకుంటూపోతే అభివృద్ధి కార్యక్రమాలకు ఒక్క పైసా మిగలదని పేర్కొంది. ఇది ఒక్క తమిళనాడు సమస్యే కాదని, అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని తెలిపింది.
 
“ప్రజలు గౌరవంగా బతకడానికి మీరు ఉపాధి మార్గాలను సృష్టించాలి. ఉదయం లేచినప్పటి నుంచి ఉచిత ఆహారం, గ్యాస్, విద్యుత్ ఇస్తూ నేరుగా ఖాతాల్లోకి నగదు జమ చేస్తుంటే, ప్రజలు ఎందుకు పని చేస్తారు? ప్రతిదీ ఉచితంగా దొరుకుతున్నప్పుడు వారు ఏం పని చేస్తారు. మనం చేస్తున్నది దేశ నిర్మాణమేనా?” అని సీజేఐ ప్రశ్నించారు.