* త్వరలో డీజీసీఏ కొత్త నిబంధనలు
దురుసుగా ప్రవర్తించే ప్రయాణికుల నియంత్రణకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) కఠిన నిబంధనలను ప్రతిపాదించింది. విమానంలో ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే ప్రయాణికులపై 30 రోజుల విమాన ప్రయాణ నిషేధం విధించనున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. విమానం, ప్రయాణికులు, ఆస్తుల భద్రత కల్పించేందుకు, విమాన ప్రయాణంలో తగిన క్రమశిక్షణ పాటించేందుకు నియమాల ఉల్లంఘనను సహించేది లేదని ఏజెన్సీ స్పష్టం చేసింది.
నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే ప్రయాణికులపై ఎయిర్‌లైన్స్ చర్యలు తీసుకోవచ్చని డీజీసీఏ తెలిపింది. విమానంలో పొగ తాగడం, దేశీయ విమానాలలో మద్యం సేవించడం, అత్యవసర ద్వారాన్ని దుర్వినియోగం చేయడం, అనుమతి లేకుండా లైఫ్ జాకెట్లు వంటి ప్రాణ రక్షక పరికరాలను ఉపయోగించడం వంటివి నిబంధనల ఉల్లంఘనల్లో కొన్ని అని తెలిపింది.
ఇతర ప్రతిపాదనలతోపాటు దురుసుగా ప్రవర్తించే ప్రయాణికులను కట్టడి చేసేందుకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్‌ఓపీ)ని రూపొందించి అమలు చేయాలని ఎయిర్‌లైన్స్‌లకు డీజీసీఏ సూచించింది. అటువంటి ప్రయాణికుల గురించి తమకు ఫిర్యాదు చేయాలని, ఈ నిబంధనల గురించి సంబంధిత వ్యక్తులు, సంస్థలకు తెలియచేయాలని కోరింది.
ఎయిర్‌లైన్ సంస్థ ఏర్పాటుచేసే స్వతంత్ర కమిటీలో మరో ఎయిర్‌లైన్‌కు చెందిన ప్రతినిధి ఉంటారని, ప్రయాణ నిషేధంపై ఈ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని డీజీసీఏ తెలిపింది. విమానంలో ఏ ప్రయాణికుడైనా సహ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తిసే వెంటనే ఆ ప్రయాణికుడిపై సంబంధిత ఎయిర్‌లైన్ 30 రోజులు, అంతకు మించి ప్రయాణ నిషేధం విధించవచ్చని ఏజెన్సీ తెలిపింది. సీఏఆర్‌లో చేయతలపెట్టిన సవరణలపై మార్చి 16 లోగా తమ సూచనలు పంపాలని సంబంధిత వ్యక్తులు, సంస్థల నుంచి డీజీసీఏ కోరింది.
నిషేధం అమలు
లెవల్ 1: 3 నెలల వరకు నిషేధం: దుష్ప్రవర్తన, కొట్టడం/తన్నడం, ఇతరులను వేధించడం, అతిగా మద్యం సేవించడం
లెవల్ 2: 6 నెలల వరకు నిషేధం: తొయ్యడం, కాలితో తన్నడం/కొట్టడం, లాక్కోవడం, అసభ్యంగా తాకడం, లైంగిక వేధింపులు
లెవల్ 3: 2ఏండ్లు లేదా అంతకుమించి నిషేధం ప్రాణానికి ముప్పు తెచ్చే దాడి, గొంతు పిసకడానికి ప్రయత్నించడం, విమాన వ్యవస్థను ధ్వంసం చేయడం లేదా తీవ్రమైన హింసకు పాల్పడడం
లెవల్ 4: 2 ఏండ్లు లేదా అంతకు మించి నిషేధం పైలట్ క్యాబిన్‌లోకి బలవంతంగా చొరబడేందుకు ప్రయత్నించడం లేదా చొరబడడం.

More Stories
కారుణ్య మరణానికి మొదటిసారి సుప్రీం అనుమతి
ఎన్సిఇఆర్టిపై కేంద్రం వివరణపై సుప్రీం అసంతృప్తి
జీపీఎస్ జామింగ్‌తో చిక్కుకుపోయిన 1000కి పైగా షిప్‌లు!