కుత్రిమ మేధలో దేశ భవిష్యత్ చూస్తున్నాం

కుత్రిమ మేధలో దేశ భవిష్యత్ చూస్తున్నాం
కుత్రిమ మేధ (ఏఐ)ను  చూసి కొందరు భయపడుతున్నారని, కానీ అందులో దేశ భవిష్యత్తును భారత్ చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిప రు. దేశ భవిష్యత్ వికాసంలో మైలురాయిలా ఏఐ నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సు’ లో గురువారం ప్రధాని ప్రసంగిస్తూ మానవ అభివృద్ధిలో ఏఐ కీలక భూమిక పోషిస్తోందని తెలిపారు.
 
ప్రపంచంలో ఏఐటెక్నాలజీ ప్రజాస్వామికీకరణ జరగాలని భారత్ కోరుకుంటోందని ప్రధానమంత్రి వెల్లడించారు. ప్రత్యేకించి గ్లోబల్ సౌత్ దేశాలకూ ఏఐ ఫలాలు అందాలని, అందుకే సర్వజన హితాయ, సర్వజన సుఖాయ (అందరి సంక్షేమం, అందరి సంతోషం) అనే థీమ్‌తో ఏఐ ఇంపాక్ట్ సదస్సును భారత్ నిర్వహిస్తోందని తెలిపారు. కొత్త టెక్నాలజీని తయారు చేయడంతో పాటు దాన్ని అందిపుచ్చుకోవడంలోనూ భారత్ ముందుంటుందని ఆయన తెలిపారు. 
ప్రపంచంలోనే అత్యధికంగా టెక్ నిపుణులు లభించే కేంద్ర బిందువుగా భారత్ ఎదిగిందని చెబుతూ మేకిన్‌ ఇండియా, భారత ఆవిష్కరణ సామర్థ్యాన్ని ఈ సదస్సు చాటుతోందని పేర్కొన్నారు.  కృత్రిమ మేథకు పరివర్తన శక్తి ఉందని పేర్కొంటూ దాన్ని దుర్వినియోగం చేస్తే విధ్వంసానికి దారితీస్తుందని, అదే సద్వినియోగం చేసుకుంటే పరిష్కారాలు చూపుతుందని తెలిపారు. మనుషులు, సాంకేతికత కలిసి అభివృద్ధి పయనం సాగించే శకంలో మనం ఉన్నామని తెలిపారు. 
భవిష్యత్తులో ఏఐ ఏం చేయగలదో కాకుండా  ప్రస్తుతం కృత్రిమ మేథను ఉపయోగించి మనం ఏం చేయగలమనేదే అసలు ప్రశ్న అని ప్రధాని చెప్పారు. ప్రజా సంక్షేమం, శ్రేయస్సే ఏఐకి మన బెంచ్‌మార్క్‌లు అని, మానవ కేంద్రీకృత ఏఐ నిర్మాణం మన లక్ష్యం అవ్వాలని ప్రధాని పేర్కొన్నారు. కృత్రిమ మేథ మనలను శాసించకూడదని, మనమే ఏఐని శాసించాలని మోదీ చెప్పారు. కృత్రిమ మేథ వినియోగంలో ‘మానవ్‌ విజన్‌’ ఉండాలని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ విజన్‌ అర్థం, ఫ్రేమ్‌వర్క్‌ను ఆయన వివరించారు.

భారత దేశంలో డిజిటల్‌ సాంకేతికత, కృత్రిమ మేథల పురోగతిని ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ప్రశంసించారు. 140 కోట్ల ప్రజలకు భారత్‌ డిజిటల్‌ ఐడెంటిటీని తీసుకువచ్చిందని కొనియాడారు. ఆవిష్కరణల పథంలో అందరూ కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

“ప్రపంచంలో మరే దేశం చేయని విధంగా భారత్ 140 కోట్ల మందికి డిజిటల్ ఐడెంటిటీని నిర్మించింది. ప్రతి నెల 20 బిలియన్ లావాదేవీలు జరిగే చెల్లింపు వ్యవస్థను ఏర్పాటు చేసింది. 50 కోట్ల డిజిటల్ హెల్త్ ఐడీలను జారీ చేసిన ఆరోగ్య మౌలిక వసతులను అభివృద్ధి చేసింది. ఫలితాలు ఇక్కడే కనిపిస్తున్నాయి. వారు దీనిని ఇండియా స్టాక్ ఓపెన్ ఇంటర్​ఆపరబుల్ సావరిన్​గా పిలుస్తున్నారు. ఈ సమ్మిట్ అసలు ఉద్దేశం కూడా ఇదే” అని మెక్రాన్ పేర్కొన్నారు.

గ్లోబల్ సౌత్‌లో మొదటి ఏఐ సమ్మిట్‌ను నిర్వహిస్తున్న భారత్‌కు యూఎన్ చీఫ్ ఆంటోనియో గుటెరస్ అభినందనలు తెలియజేశారు. భారత్‌లో జరిగే ఈ ఏఐ సమ్మిట్‌కు ప్రత్యేక అర్థం ఉందని చెప్పారు. ఏఐ భవిష్యత్తును కొన్ని దేశాలు లేదా కొంత మంది బిలియనీర్లు నిర్ణయించలేరని స్పష్టం చేశారు. నిజమైన ఇంపాక్ట్ అంటే జీవితాలను మెరుగుపరిచి, భూమిని రక్షించే సాంకేతికత అని అభిప్రాయపడ్డారు.
 
భారత్‌లో తమ సంస్థ 15 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడుతోందని, అందులో భాగంగా పూర్తి స్థాయి ఏఐ హబ్‌ను ఏర్పాటు చేస్తోందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. అలాగే దేశంలోని ప్రతి పౌరుడికి ఏఐ టూల్స్ చేరేలా చేయడమే తమ లక్ష్యమని టీసీఎస్ ఛైర్మన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. ఏఐ రంగంలో భారత్ కీలక పాత్ర పోషించనుందని ఆంథ్రోపిక్‌ సీఈఓ డారియో అమోడెయ్‌ అభిప్రాయపడ్డారు.