కర్రెగుట్టల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి!

కర్రెగుట్టల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి!
ఛత్తీస్‌గఢ్‌‌-తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో గురువారం ఉదయం నుంచి భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలిసింది. భద్రతాబలగాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మృతుల వివరాలను అధికారవర్గాలు వెల్లడించాల్సి ఉంది.

‘నక్సల్స్‌ మిషన్‌-2026’ లో భాగంగా సీఆర్పీఎఫ్, ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు ‘కేజీహెచ్‌-2’ (కర్రె గుట్టలు హిల్స్‌-2) ను రెండు రోజుల క్రితం ప్రారంభించాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దేవ్‌జీ, జూనియర్‌ క్యాడర్‌కు చెందిన బెటాలియన్‌ ఇన్‌ఛార్జి కేసా సోధి కోసం రెండు వేల మందితో కూడిన బలగాలు వేటను ప్రారంభించాయి.

కాగా 2026 మార్చి 31 నాటికి దేశం నుంచి నక్సలిజాన్ని నిర్మూలించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం 2024లో మావోయిస్టుల కోసం భారీ ఆపరేషన్‌లను చేపట్టింది. సీఆర్పీఎఫ్, కోబ్రా, డీఆర్జీ, సీఏఎఫ్‌ సంయుక్త బలగాలు గత ఏడాది ఏప్రిల్‌ నెలలో 21 రోజులపాటు కర్రెగుట్టల్లో నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులు మృతిచెందారు. 

అయితే అక్కడినుంచి మావోయిస్టు పార్టీ సీనియర్‌ క్యాడర్‌ తప్పించుకుంది. ప్రస్తుతం కర్రెగుట్టల్లోని తడపల, పామునూరు, మురుమూరు, డోలీ వంటి ప్రాంతాల్లో ఎఫ్‌ఓబీ (ఫార్వర్డ్‌ ఆపరేటింగ్‌ బేస్‌) లను ఏర్పాటు చేసి సీఆర్పీఎఫ్‌ బలగాలు నిత్యం ఆపరేషన్‌ చేపడుతున్నాయి. తాజాగా చేపట్టిన ‘కేజీహెచ్‌-2’ సైతం అత్యంత వ్యూహాత్మక ఆపరేషన్‌గా భావిస్తున్నారు.