గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఢిల్లీ ఏఐ సదస్సు

గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఢిల్లీ ఏఐ సదస్సు
ఢిల్లీలో జరుగుతున్న  ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026, ప్రదర్శన గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి చేరింది. తాము బాధ్యతాయుతంగా ఈ ఏఐ పరిజ్ఞానం వినియోగిస్తాం, దుర్వినియోగపర్చబోం అని ప్రతిన వహిస్తూ 2,50,946 మంది యువజనం ప్రకటించారు. ఇది గిన్నిస్ రికార్డుల్లో చేరిందని రికార్డు నిర్వాహకులు ప్రవీణ్ పటేల్ బుధవారం తెలిపారు.
 
 కేవలం 24 గంటల వ్యవధిలో ఈ భారీ సంఖ్యలో జనం ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఇంతకు ముందు ఇదే విషయంపై ఉన్న రికార్డు కేవలం 5000. స్కూళ్లు, కాలేజీలు ఇతర వేదికల్లో ఈ విధంగా రేపటి తరం ఈ పరిజ్ఞానం పట్ల ప్రతిన వహించడం ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు తార్కాణం అని ఐటి వ్యవహారాల మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
 
కాగా, ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సదస్సును మరో రోజు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 20 వరకు సదస్సు జరగాల్సి ఉంది. కానీ, ఫిబ్రవరి 21 వరకు సదస్సును నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఐటీ శాఖ తెలిపింది. అంతేకాదు ప్రతి రోజు సాయంత్రం 6.00 గంటల వరకే సదస్సు నిర్వహించేవారు. కానీ, బుధవారం నుంచి రాత్రి 8.00 గంటల వరకు సదస్సు జరుగుతుంది.

సదస్సుకు వస్తున్న స్పందన, విజిటర్స్, ఎగ్జిబిటర్స్ నుంచి వచ్చిన వినతులు వంటివి దృష్టిలో ఉంచుకుని షెడ్యూల్‌లో మార్పులు చేశారు. అలాగే సదస్సు జరిగే ప్రదేశం తక్కువ విస్తీర్ణంలో ఉండటం, సందర్శకుల సంఖ్య ఎక్కువ ఉండటంతో వారి సౌలభ్యం కోసం సదస్సు పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.  రెండు రోజుల్లోనే సదస్సుకు 2.5 లక్షల మంది హాజరైనట్లు అంచనా. ఇందులో ఎక్కువ మంది 30 ఏళ్లలోపు వాళ్లే ఉన్నారని ఆయన తెలిపారు.

మరోవైపు ప్రస్తుతం ఉన్న ఒత్తిడి, రద్దీ దృష్ట్యా సాధారణ పౌరులను ఇప్పుడే సదస్సుకు అనుమతించడం లేదు. నిజానికి గురువారం, ఫిబ్రవరి 19 నుంచి సాధారణ ప్రజలను అనుమతించాలి. కానీ, ఫిబ్రవరి 20, 21 తేదీల్లో మాత్రమే సాధారణ ప్రజలను అనుమతించాలని తాజాగా నిర్ణయించారు. సదస్సుకు హాజరవ్వాలనుకునే ప్రజలు ఆన్‌లైన్‌లో రిజిష్టర్ చేసుకోవాలి. అప్పటివరకు రిజిష్టర్ చేసుకున్న కంపెనీలు, ప్రతినిధులు, టెక్ నిపుణులు, ఇన్వెస్టర్స్‌కు మాత్రమే అనుమతి ఉంటుంది.

సదస్సుకు భారీ స్థాయిలో సందర్శకులు, ప్రతినిధులు వస్తుండటంతో కొంత గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇక.. ఈ సదస్సుకు దాదాపు 45 దేశాలకు చెందిన ఏఐ కంపెనీలు, ప్రతినిధులు, నిపుణులు, మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. వేదిక వద్ద 300కుపైగా ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పెవిలియన్స్, లైవ్ డెమాన్‌స్ట్రేషన్స్‌ను ఏర్పాటు చేశారు. 

600కుపైగా స్టార్టప్‌లు ఇందులో పాల్గొంటున్నాయి. ఈ సదస్సులో ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, సెర్బియా, ఈస్టోనియా, తజికిస్తాన్, ఆఫ్రికా వంటి దేశాలకు చెందిన ఏఐ కంపెనీలతో అంతర్జాతీయ ఒప్పందాలు కుదిరాయి.