బంగ్లా ప్రధానిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారం

బంగ్లా ప్రధానిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారం
* రెహమాన్‌ను భారత్ పర్యటనకు ఆహ్వానిస్తూ ప్రధాని మోదీ లేఖ

బంగ్లాదేశ్‌ ఎన్నికలు ముగిసిన ఐదు రోజుల తర్వాత, బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (బిఎన్‌పి) ఛైర్మన్‌ తారిఖ్‌ రెహమాన్‌ మంగళవారం నూతన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బంగ్లాదేశ్‌ అధ్యక్షుడు మహ్మద్‌ షహబుద్దీన్‌ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన ప్రధాని రెహమాన్‌ 25 మంది క్యాబినెట్‌ మంత్రులు, 24 మంది సహాయ మంత్రులతో కూడిన బృందానికి నాయకత్వం వహిస్తారు. వీరందరితో అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయించారు. 

పార్లమెంటు సౌత్‌ ప్లాజాలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 1,200 మంది విదేశీ, దేశీయ అతిథులు హాజరయ్యారు. భారత్‌ తరుపున లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రి, మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు, పాకిస్తాన్‌ మంత్రి అహ్సాన్‌ ఇక్బాల్‌ చౌదరిలు హాజరయ్యారు. బిఎన్‌పి నేషనల్‌ స్టాండింగ్‌ కమిటీలోని ప్రముఖ సభ్యులైన మీర్జా ఫక్రుల్‌ ఇస్లాం ఆలంఘీర్‌, అమీర్‌ ఖోస్రు మహమూద్‌ చౌదరిలతో పాటు పలువురు క్యాబినెట్‌ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

జెన్‌-జెడ్‌ నిరసనకారులలో ప్రసిద్ధి చెందిన జోనైద్‌ సాకి, సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు డాక్టర్‌ ఖలీలుర్‌ రెహమాన్‌ కూడా ‘టెక్నోక్రాట్‌’ క్యాబినెట్‌ మంత్రిగా కొనసాగుతున్నారు. రోహింగ్యా సమస్యలపై పని చేస్తున్న బంగ్లాదేశ్‌ దౌత్యవేత్త డాక్టర్‌ రెహమాన్‌ తదుపరి విదేశాంగ మంత్రవుతారని బిఎన్‌పి నేతలు ధృవీకరించారు. 

మహ్మద్‌ యూనస్‌ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం నుండి అధికార బదిలీ ప్రక్రియ ప్రమాణస్వీకార కార్యక్రమం అనంతరం ప్రారంభమైంది.ప్రమాణస్వికారానికి హాజరైన స్పీకర్‌ ఓం బిర్లా భారత ప్రధాని నరేంద్ర మోదీ  రాసిన లేఖను స్వయంగా రెహమాన్‌కు అందజేసారు. 

”బంగ్లాదేశ్‌లో ఇటీవల ముగిసిన పార్లమెంటరీ ఎన్నికల్లో బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ విజయం సాధించినందుకు, బంగ్లాదేశ్‌ తదుపరి ప్రధానమంత్రిగా మీరు నియమితులైనందుకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను” అని ప్రధాని మోదీ ఆ లేఖలో పేర్కొన్నారు.  పరస్పర అనుకూల సమయంలో భారత్‌ను సందర్శించాలని మోదీ తారిఖ్‌ రెహ్మాన్‌ను ఆహ్వానించారు. రెహమాన్‌తో పాటు ఆయన భార్య డాక్టర్‌ జుబైదా, ఆయన కుమార్తె జైమాలను కూడా మోదీ ఆహ్వానించారు. మీకు స్వాగతం పలకడం కోసం భారత్‌ ఎదురుచూస్తోందంటూ ఆ లేఖలో తెలిపారు.