మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు

మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు

మోహన్ బాబు యూనివర్సిటీ  ఛాన్సలర్ మంచు మోహన్ బాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. విద్యార్థి నాయకుల  కిడ్నాప్ కేసులో తనను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీనితో పాటు వివాదానికి సంబంధించిన అనుబంధ పిటిషన్‌ను కూడా కొట్టివేస్తూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 

విచారణ సందర్భంగా పోలీసులు కోర్టుకు కీలక ఆధారాలను సమర్పించారు. కిడ్నాప్ ఘటనకు ముందు ఆ తర్వాత యూనివర్సిటీ పీఆర్‌వో సతీష్‌తో మోహన్ బాబు నిరంతరం ఫోన్‌లో మాట్లాడినట్లు, వారిద్దరి మధ్య మెసేజ్‌లు కూడా మారినట్లు పోలీసులు కాల్ డేటా, వాట్సాప్ చాట్ వివరాలను చూపించినట్లు కోర్టు పేర్కొంది. 

ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి వెంకట జ్యోతిర్మయి కేసుకు సంబంధించిన మెయిన్ పిటిషన్‌పై పూర్తి స్థాయి విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కేసు తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదా వేశారు. ఈ వివాదం మూలం గత కొన్నేళ్లుగా మోహన్ బాబు యూనివర్సిటీ చుట్టూ తిరుగుతోంది. 

ముఖ్యంగా ఫీజుల పెంపు, ఇతర విద్యార్థి సమస్యలపై ఇప్పటికే పలుమార్లు వివాదాలు చెలరేగగా, కోర్టుల దాకా వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఫీజుల పెంపు , విద్యార్థుల సమస్యలపై నిరసన తెలిపిన విద్యార్థి సంఘం నాయకులు గుర్తుతెలియని వ్యక్తుల చేత కిడ్నాప్‌కు గురయ్యారనే ఆరోపణలు వెలుగులోకి రావడంతో వివాదం మరింత ముదిరింది. 

బాధిత విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు యూనివర్సిటీ పీఆర్‌వో సతీష్ పాత్రపై ప్రాథమిక ఆధారాలు లభించగా, ఆ తర్వాతి విచారణలో ఈ మొత్తం వ్యవహారంలో ఛాన్సలర్ మోహన్ బాబు ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి.  కిడ్నాప్ జరిగిన సమయానికి సంబంధించిన కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్ ఆధారాలను పోలీసులు సేకరించి, వాటి ఆధారంగానే కేసులో ఆయనను నిందితుడిగా చేర్చే దిశగా ముందుకెళ్తున్నారు.