ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలిలో ఇందాపూర్ డెయిరీ పేరుతో హెరిటేజ్ సంస్థ టిటిడికి నెయ్యి సరఫరా అంశంపై సభలో చర్చించాలని కోరుతూ వైసిపి సభ్యులు కెఆర్‌జె భరత్, సిపాయి సుబ్రహ్మణ్యం ప్రతిపాదించిన తీర్మానాన్ని మండలి ఛైర్మన్ తిరస్కరించడంతో గందరగోళం చెలరేగింది. దీంతో వైసిపి సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. ప్లకార్డులు ప్రదర్శించారు.
వాయిదా అనంతరం సభను ప్రారంభించిన వెంటనే వైసిపి సభ్యులు తిరిగి ఛైర్మన్ పోడియం చుట్టుముట్టి టిటిడికి నెయ్యి సరఫరాపై చర్చకు అనుమతించాలని చర్చకు పట్టుబడుతూ ఛైర్మన్ పోడియంపైకి దూసుకెళ్లి మరీ వైసిపి సభ్యులు నినాదాలు చేశారు. దానితో సభను మళ్లీ వాయిదా వేశారు. సభను తిరిగి ప్రారంభించిన వెంటనే మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ తిరుమల లడ్డూ కల్తీ విషయం సిట్ విచారణలో ఉందని చెప్పారు.
నెయ్యి కల్తీ అయిందని టిటిడి మాజీ ఛైర్మన్ సుబ్బారెడ్డి అంగీకరించారని, సంబంధం లేని విషయంలో హెరిటేజ్‌ను తీసుకురావడం దుర్మార్గం అన్నారు. దీంతో వైసిపి సభ్యులు కూటమి పాలన కల్తీ, చంద్రబాబు పాలన కల్తీ, హెరిటేజ్ నెయ్యి కల్తీ, గోవిందా, గోవిందా అని నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది.
ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని, జంతువుల కొవ్వు కలిసిందని సిఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేసి ప్రజల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. ఇందుకు ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తక్కువ ధరకు నెయ్యి కొనుగోలు టిడిపి హయాం నుంచే ప్రారంభమైందని, ఇప్పుడు ఆకస్మికంగా హెరిటేజ్‌కు మేలు చేసేందుకు నెయ్యి ధరను కిలో రూ.650కు పెంచారని ధ్వజమెత్తారు.
ఇదే దశలో సభలో టిడిపి సభ్యులు కూడా పోడియం వద్దకు వెళ్లి తమ నిరసన వ్యక్తం చేశారు. ఇరు పక్షాలు పోడియం వద్ద పోటాపోటీగా నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడంతో గందరగోళం నెలకొంది.

More Stories
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ధార్మిక సదస్సు
డ్రగ్స్ కేసులో ఎంపీ మహేష్ .. టిటిడి లో పెను దుమారం
దేవాలయ భూముల నుంచి లక్షన్నర ఎకరాలకు మోక్షం!