* ఇకపై భారత్‌లోనే ‘హామర్ క్షిపణుల తయారీ’!
భారతదేశం, ఫ్రాన్స్ మంగళవారం ద్వైపాక్షిక సంబంధాలను “ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం”గా పెంచాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్య జరిగిన చర్చల తర్వాత ఆవిష్కరణ, సాంకేతికత, వాణిజ్యం, సాంస్కృతిక మార్పిడిలో వివిధ సహకార చర్యలను ప్రకటించాయి. ముంబైలో ఒక సంయుక్త పత్రికా ప్రకటనను ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ, ఈ భాగస్వామ్యం లోతైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని, పెరుగుతున్న అంతర్జాతీయ అనిశ్చితి మధ్య “ప్రపంచ స్థిరత్వం, ప్రపంచ పురోగతి”కి శక్తిగా పనిచేస్తుందని తెలిపారు.
దీనివల్ల ఈ శక్తివంతమైన క్షిపణులు ఇకపై భారత్‌లోనే తయారుకానున్నాయి. అంతేకాదు భారత సైన్యం, ఫ్రాన్స్ ల్యాండ్ ఫోర్సెస్ సంస్థల్లో ఇరు దేశాల అధికారులు పరస్పరం విధులు నిర్వహించేలా (రిసిప్రొకాల్ డిప్లాయ్‌మెంట్) ఓ అవగాహనకు వచ్చారు. భారత్‌తో కుదిరిన రక్షణ సంబంధాలపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ ముంబయిలో జరిగిన ‘ఇండియా-ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఫోరమ్’లో మాట్లాడుతూ మేక్ ఇన్ ఇండియా’లో ఫ్రాన్స్ ఒక కీలక భాగస్వామి అని స్పష్టం చేశారు.
ఆవిష్కరణ అంటే కేవలం సాంకేతిక రంగంలో సాధించే విజయాలు మాత్రమే కాదని మేక్రాన్ చెప్పుకొచ్చారు. అవి సామాన్య ప్రజల ప్రయోజనం కోసం, వారి జీవితాలను మెరుగుపరచడం కోసమని తెలిపారు. ప్రజల జీవితాలను మరింత ఆరోగ్యకరంగా, సురక్షితంగా మార్చడం కోసం అనే ఉమ్మడి ఆకాంక్షతోనే ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతోందని చెప్పారు.
రాఫెల్ యుద్ధ విమానాలు, జలాంతర్గాములు, ఐదవ తరం విమానాల ఇంజన్లు ఇలా అనేక రంగాలలో ఫ్రాన్స భారత్‌తో కలిసి పని చేస్తోందని చెబుతూ ఈ రంగంలో సాంకేతిక బదిలీని తాము కూడా విశ్వసిస్తామని పేర్కొన్నారు. అలాగే ప్రయివేటు రంగంలో తొలిసారిగా నెలకొల్పిన కర్ణాటకలోని వేమగల్‌లో ఎయిర్‌బస్ హెచ్125 హెలికాప్టర్ అసెంబ్లీ లైన్‌ను రెండు దేశాల రక్షణ మంత్రుల సమక్షంలో వర్చువల్‌గా ప్రారంభించారు.
వీటితో పాటు ఇండో-ఫ్రెంచ్ సెంటర్ ఫర్ ఎఐ ఇన్ హెల్త్, ఇండో-ఫ్రెంచ్ సెంటర్ ఫర్ డిజిటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్ ఇన్ ఏరోనాటిక్స్ వంటి సంస్థలను కూడా ఇరువురు నేతలు ప్రారంభించారు. ‘ఇవి కేవలం సంస్థలు మాత్రమే కాదు, భవిష్యత్తును నిర్మించే వేదికలు’ అని ఈ సందర్భంగా మోదీ తెలిపారు.
ఆధిపత్యం లేని ప్రపంచం, చట్టబద్ధ పాలన కోసం ఉమ్మడి విలువల ప్రాతిపదికగా ఇరుదేశాల ద్వైపాక్షిక బంధం చాలా ప్రత్యేకమైన స్వభావం కలిగియున్నదని మాక్రాన్ చెప్పారు. ఆధిపత్యానికి వ్యతిరేకంగా కొత్త మార్గాన్ని అనుసరిద్దామని ఆయన పేర్కొన్నారు. కలిసికట్టుగా నడుద్దామని, ప్రపంచానికి కలిసి పనిచేయడం ఎలాగో ఒక నమూనగా నిలుద్దామని తెలిపారు. పరస్పరం గౌరవించుకోవాలని, అలాగే వైవిధ్యాన్ని గౌరవించాలని, గణాంకాల విషయాల్లో పారదర్శకంగా నిలువాలని ఆయన పిలుపిచ్చారు.

More Stories
బంగ్లా ప్రధానిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారం
‘ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్’గా స్మృతి మంధాన
ప్రపంచంలోని టాప్-3 ఏఐ సూపర్ పవర్స్ లో భారత్