2014లో తాను ముఖ్యమంత్రి కాకపోవడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీనే కారణమని అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ ఆరోపించారు. ఆనాడు 58 మంది పార్టీ ఎమ్మెల్యేలు తనకు మద్దతు ఇచ్చారని, ఆ సమయంలో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా సీఎంగా ప్రమాణ స్వీకారానికి తేదీని నిర్ణయించుకోవాలని చెప్పినట్లుగా హిమంత పేర్కొన్నారు.
కానీ, రాహుల్ జోక్యంతో తనకు ఆనాడు ఆ పదవి రాలేదని ఆరోపించారు. “2014 ఎన్నికల సమయంలో సోనియా గాంధీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు తేదీని నిర్ణయించమని నన్ను అడిగారు. అయితే, కామాఖ్య ఆలయంలో అంబూబాచి మేళా తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పాను. కానీ, ఆ సమయంలో అమెరికాలో ఉన్న రాహుల్ గాంధీ పార్టీ నాయకులకు ఫోన్ కాల్స్ చేశారు. ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది” అని వెల్లడించారు.
“ఆ సమయంలో నేను చాలా బాధపడ్డాను. కానీ, తర్వాత నాకు ఓ ఆలోచన వచ్చింది. ఒకవేళ నేను కాంగ్రెస్‌లోనే ఉండి ఉంటే నాకు ఏదైతే లభించేదో, అంతకంటే ఎక్కువే ఆ దేవుడు నాకు ఇచ్చాడు. బీజేపీలో చేరి ముఖ్యమంత్రి అయ్యాను. సనాతన ధర్మానికి సేవ చేసే అవకాశాన్నీ పొందాను. ఒకవేళ నేను కాంగ్రెస్‌లో ఉండి ఉంటే అది సాధ్యం అయ్యేది కాదు. కాబట్టి జీవితంలో ఏమి జరిగినా అది మన మంచికేనని నేను బలంగా నమ్ముతున్నా” అని హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు.
తాను ఎప్పుడైనా ఒక పుస్తకం రాస్తే ఈ పరిణామాల గురించి వివరిస్తానని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా, 2011 అసెంబ్లీ ఎన్నికల తర్వాత అసోం కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు తలెత్తాయి. అప్పటివరకు రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న తరుణ్ గొగొయికి మరోసారి కాంగ్రెస్ ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. అప్పటివరకు, ఎన్నికల్లో కాంగ్రెస్ ను విజయపథంలో నడిపించిన హిమంత బిశ్వ శర్మకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆయన అసంతృప్తి చెందారు.
కాంగ్రెస్ అధిష్టానం కూడా గొగొయికి మద్ధతు ఇవ్వడంతో, చాలా మంది ఎమ్మెల్యేలు గొగొయికి వ్యతిరేఖంగా తిరుగుబాటు చేశారు. అయినప్పటికీ, రాహుల్ గాంధీ నాయకత్వంలోని హైకమాండ్ తరుణ్ గొగొయికి మద్ధతు పలికింది. ఈ విభేదాల కారణంగానే హిమంత బిశ్వ శర్మ 2014 జులైలో రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం, 2015లో హిమంత కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలో చేరారు. అనంతంరం 2016లో అసోంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి, బీజేపీ పార్టీ అధికారంలోకి రావడానికి హిమంత కీలక పాత్ర పోషించారు.
మరోవంక, అస్సాం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భూపేన్ బోరా ఫిబ్రవరి 22న బిజెపిలో చేరనున్నారని, దిలీప్ సైకియా దీనికి సంబంధించిన వివరాలను రూపొందిస్తారని ముఖ్యమంత్రి వెల్లడించాయిరు. ఆయనతో పాటు గౌహతి, ఉత్తర లఖింపూర్‌లలో చాలా మంది కాంగ్రెస్ నాయకులు బిజెపిలో చేరుతారని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్‌లో చివరి గుర్తింపు పొందిన హిందూ నాయకుడు అని ఆయనను అభివర్ణించారు.
బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఇప్పటికే ఆయన చేరికను ఆమోదించారని, ఆయనను స్వాగతిస్తున్నారని బిస్వా శర్మ తెలిపారు. అంతకుముందు రోజు, హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ కు రాజీనామా చేసిన భూపేన్ బోరాను కలిశారు. గౌహతిలోని ఘోరమారా ప్రాంతంలోని బోరా నివాసానికి శర్మ వెళ్లగా, ఆయన భార్య, కుమారుడు ‘ఆరతి’తో ఆయనకు స్వాగతం పలికారు.

More Stories
‘ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్’గా స్మృతి మంధాన
“వ్యూహాత్మక భాగస్వామ్యం”గా భారత్- ఫ్రాన్స్ సంబంధాలు
ప్రపంచంలోని టాప్-3 ఏఐ సూపర్ పవర్స్ లో భారత్