100 బిలియన్ డాలర్లతో అదానీ డేటా సెంటర్ల ఏర్పాటు

100 బిలియన్ డాలర్లతో అదానీ డేటా సెంటర్ల ఏర్పాటు

పునరుత్పాదక ఇంధనంతో నడిచే హైపర్‌స్కేల్ ఏఐ డేటా సెంటర్లను అభివృద్ధి చేసేందుకు 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. 2035 నాటికి అవి అందుబాటులోకి వస్తాయని మంగళవారం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సర్వర్ల తయారీ, క్లౌడ్ ప్లాట్‌ఫామ్ సహా ఇతర అనుబంధ రంగాల్లో మరో 150 బిలియన్ డాలర్ల అదనపు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.

ప్రస్తుతం ప్రపంచం ఇంటెలిజెన్స్ విప్లవంలోకి అడుగుపెడుతోందని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తెలిపారు. ఇంధనం, కంప్యూటింగ్ మధ్య సమతుల్యతను సాధించిన దేశాలే రాబోయే దశాబ్దాన్ని శాసిస్తాయని,  ఈ విషయంలో నాయకత్వం వహించడానికి భారత్‌ సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.  ఏఐ యుగంలో భారత్‌ కేవలం వినియోగదారుగా మాత్రమే మిగిలిపోదని సృష్టికర్తలుగా, ఇంటెలిజెన్స్ ఎగుమతిదారులుగా ఉంటుందని విశ్వాసం వ్యక్తంచేశారు. 

అందులో భాగస్వామ్యం కావడం తమకు గర్వకారణమని అదానీ తెలిపారు. ప్రస్తుతం అదానీ సంస్థకు 2 గిగావాట్ సామర్థ్యంతో కూడిన డేటా సెంటర్లు ఉండగా, దానికి ఐదు గిగావాట్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.  అందులో భాగంగా విశాఖపట్నంలో గిగావాట్ సామర్థ్యంతో ఏటా డేటా సెంటర్‌ను నెలకొల్పడానికి గూగుల్‌తో అదానీ గ్రూప్‌ ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌, పుణెలో డేటా సెంటర్ల ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం చేసుకుంది.

ఈ పెట్టుబడుల ద్వారా దేశంలో దాదాపు 250 బిలియన్ డాలర్ల విలువైన ఏఐ ఎకోసిస్టమ్ ఏర్పడుతుందని అంచనా.  దీంతో సర్వర్ తయారీ, క్లౌడ్ ప్లాట్ఫామ్లు, ఇతర అనుబంధ రంగాల్లో 150 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించే అవకాశముందని అదానీ గ్రూప్ తెలిపింది.  భారతదేశం అంతటా 250 బిలియన్ డాలర్ల మౌలిక సదుపాయాల పెట్టుబడులను ఆకర్షించే వీలుందని వివరించింది.

గ్లోబల్ సప్లై చైన్‌పై ఆధారపడటం తగ్గించేందుకు ట్రాన్స్‌ఫార్మర్లు, పవర్ ఎలక్ట్రానిక్స్, గ్రిడ్ సిస్టమ్స్, థర్మల్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్‌ను భారత్‌లోనే తయారు చేయాలని అదానీ గ్రూప్ నిర్ణయించింది.  ఇందులో భాగంగా మౌలిక సదుపాయాలే కాకుండా, విద్యా సంస్థలతో కలిసి ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీరింగ్ కరికులమ్, అప్లైడ్ ఏఐ రీసెర్చ్ ల్యాబ్స్, నేషనల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌లను అదానీ గ్రూప్ ప్రారంభించనుంది. తద్వారా దేశంలోని ఏఐ స్టార్టప్‌లకు, పరిశోధకులకు హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ వనరులు అందుబాటులోకి వస్తాయి.