గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదల ఇళ్ల పట్టాల పేరుతో భారీ కుంభకోణానికి, రాజకీయ మోసానికి పాల్పడిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2019–2024 మధ్య కాలంలో జరిగిన నకిలీ పట్టాల పంపిణీ, భూమి చూపించకుండా చేసిన ఎన్నికల మోసంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
బీజేపీ చేపట్టిన ‘జనతా వారధి’ కార్యక్రమం ద్వారా వచ్చిన పిర్యాదులు క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు ప్రజల్లో హృదయ విదారకమైన ఆవేదన ఉందని మాధవ్ పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో బీజేపీ నేతలు వినతిపత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపీ శ్రీనివాస్ సమన్వయం చేశారు.
ఇది కేవలం రాజకీయ వినతి కాదు, పేదవాడి గుండెల్లో నుంచి వచ్చిన ఆవేదన అని వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో లబ్ధి పొందాలనే కుట్రతో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం సుమారు 30 లక్షలకు పైగా పట్టాలను పంపిణీ చేసిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. కానీ, నేడు ఆ పట్టాలన్నీ ఎందుకూ పనికిరాని చిత్తు కాగితాలుగా పేదల ఇళ్లలో మిగిలిపోయాయని విమర్శించారు.
పట్టా చేతికిచ్చారు కానీ, ఆ పట్టాకు తగిన భూమి ఎక్కడుందో చూపలేదని, ఇల్లు నిర్మించి ఇవ్వలేదని బీజేపీ నేతలు తమ వినతి పత్రాల్లో పేర్కొన్నారని గుర్తుచేశారు. 2019-24 మధ్య ఇచ్చిన పట్టాల్లో ఎన్ని నకిలీవి? అసలు భూమి లేని పట్టాలు ఎన్ని? అనేది తేల్చడానికి ప్రత్యేక విచారణ జరపాలని మాధవ్ కోరారు. నకిలీ పట్టాలు తయారు చేసిన వారు, దానికి సహకరించిన అధికారులు, సంతకాలు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి లక్షలాది ఇళ్లు కేటాయించి వేల కోట్ల నిధులు ఇస్తే, గత ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసి పేదలను వంచించిందని మాధవ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన నిలవాలని, గత ప్రభుత్వ అవినీతిపై అధికారులు ఉదాసీనంగా ఉండకుండా తక్షణమే చర్యలు చేపట్టాలని మాధవ్ డిమాండ్ చేశారు. బాధితులకు కేవలం కాగితాలు కాదు, నిజమైన ఇల్లు కేటాయించాలని నేతలు డిమాండ్ చేశారు.

More Stories
డిజిటల్ విప్లవానికి భారత్లో బలమైన పునాదులు
ఆధ్యాత్మిక కేంద్రంగా ఏపీని తీర్చిదిద్దుతాం
ఏపీ బడ్జెట్ రాష్త్ర అభివృద్ధికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్