సిబిఐ కేసుల్లో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు 

సిబిఐ కేసుల్లో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు 
జగన్​ మోహన్ రెడ్డి అక్రమాస్తులతో పాటు గాలిజనార్ధన్‌రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీకి గనుల కేటాయింపు కేసుల్లో సీనియర్ ఐఏఎస్​ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ రెండు కేసుల నుంచి తనను తప్పించాలంటూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్‌ను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్ట్ గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీకి నిబంధనలకు అనుగుణంగానే గనులు కేటాయించినట్లు శ్రీలక్ష్మి వివరణ ఇచ్చుకోగా గనులశాఖ కార్యదర్శిగా అనేక ఉల్లంఘనలకు పాల్పడినట్లు సీబీఐ కౌంటర్‌ ఇచ్చింది. ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీకి అక్రమంగా గనులు కేటాయించడంలో శ్రీలక్ష్మి కీలకంగా వ్యవహరించారని, క్యాప్టివ్‌ మైనింగ్‌ అనే పదాన్ని తొలగించి అక్రమాలకు ఆమే బాటలు వేశారని సీబీఐ స్పష్టం చేసింది. 
 
పదవిలో ఉన్నంతకాలం శ్రీలక్ష్మి భారీగా అక్రమాస్తులు కూడబెట్టుకున్నారని వివరించింది. ఆ సమయంలో శ్రీలక్ష్మి మరిది భారీగా అక్రమాస్తులు సంపాదించారని సీబీఐ వెల్లడించింది. గనులు కేటాయించేందుకు శ్రీలక్ష్మి లంచం కూడా డిమాండ్ చేసినట్టు సాక్షులు వాంగ్మూలం ఇచ్చారని కోర్టుకు తెలిపిన సీబీఐ ఆమె అక్రమాలన్నీ విచారణలోనే తెలుతాయని తెలిపింది. 
 
సీబీఐ వాదనల్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు శ్రీలక్ష్మి వేసిన డిశ్చార్జి పిటిషన్‌ను కొట్టేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్థించింది. వేరే కేసుగా భావించి ఇందులో తొలుత స్టే ఇచ్చామని, ఇప్పుడు ఆ పొరపాటును సవరిస్తున్నామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుందరేశ్‌ అన్నారు. పొరపాటుగా ఇచ్చిన స్టేను నిందితులు ఎంజాయ్‌ చేశారని వ్యాఖ్యానించారు. విచారణ కొనసాగించాలని ట్రయల్‌ కోర్టును ఆదేశించారు.
మరోవైపు జగన్‌ అక్రమాస్తుల కేసులో భాగంగా పెన్నా సిమెంట్స్‌కు లీజుల మంజూరు చేయడంలో అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగం పై ఆధారాలు ఉన్నాయని సీబీఐ గతంలో స్పష్టం చేసింది. శ్రీలక్ష్మి పై కేసు కొనసాగించడానికి అన్ని ఆధారాలు సేకరించామని తెలంగాణ హైకోర్టుకు నివేదించిన విషయం తెలిసిందే.
శ్రీలక్ష్మి పై కేసు కొనసాగించడానికి అన్ని ఆధారాలను సేకరించామని సీబీఐ తెలిపింది. గతంలో స్పష్టం చేసిన ఈ విషయంపై మళ్లీ పిటషన్ దాఖలు వేయడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అనంతపురం జిల్లా యాకిడిలో 231 ఎకరాల భూ కేటాయింపు, ఉమ్మడి కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం కౌలపల్లిలో 304.70 హెక్టార్ల లీజును అంచనా వేయడంలో, రంగారెడ్డి జిల్లా తాండూరులో 822.13 ఎకరాల లీజు రెన్యువల్​తో పాటు హైదరాబాద్‌లో పయనీర్ హోటళ్ల నిర్మాణాలకు సబ్సిడీలు అందించడంలో నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ సీబీఐ పెన్నా సిమెంట్స్‌కు చెందిన పెన్నా ప్రతాప్ రెడ్డిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.