కేరళలోని శబరిమల ఆలయంలోకి 10-50 మధ్య వయస్సు గల మహిళలు ప్రవేశించడానికి అనుమతిస్తూ ఇచ్చిన తీర్పుపై సమీక్ష, రిట్ పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు సోమవారం తొమ్మిదిమంది జడ్జీల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ విచారణను ధర్మాసనం ఏప్రిల్ 7న ప్రారంభిస్తుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయమల్య బాగ్చి, విపుల్ ఎం పంచోలితో కూడిన ధర్మాసనం చెప్పింది.
ఇది ఏప్రిల్ 22 నాటికి ముగిసే అవకాశం ఉందని పేర్కొంది. మహిళల ప్రవేశంపై నిషేధానికి సంబంధించి మార్చి 14లోపు లిఖితపూర్వక వాదనలను సమర్పించాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, ఆలయ నిర్వాహకులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శబరిమలతో పాటు మసీదులు, దర్గాలోకి మహిళల ప్రవేశంపై కూడా విచారించనుంది. అలాగే ఇతరులను పెళ్లి చేసుకున్న పార్సీ మహిళలకు మతపరమైన ప్రాంగణాల్లోకి ప్రవేశం లేకపోవడం వంటి అంశాలపై పరిగణనలోకి తీసుకుంది.
అయితే నిర్ణయించిన షెడ్యూల్‌కు కట్టుబడి ఉండాలని అన్ని పక్షాలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. 10-50మధ్య వయస్సు గల మహిళలను ప్రవేశానికి అనుమతిస్తూ 2018 సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. 2019లో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే నియమించిన తొమ్మిది మంది జడ్జీల ధర్మాసనం సమీక్ష పిటిషన్ల విచారణను నిర్ణయించిందని ప్రస్తుత సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
కరోనా మహమ్మారి కారణంగా ధర్మాసనం ఎదుట జాబితా చేసిన విచారణలను అకస్మాత్తుగా రద్దు చేయాల్సి వచ్చిందని తెలిపింది. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత, శబరిమల కేసు మొదటిసారి విచారణకు వచ్చింది. అప్పటిరాజ్యాంగ ధర్మాసనంలో తొమ్మిది మంది జడ్జీలతో కూడిన అప్పటి ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్ మాత్రమే మిగిలి ఉన్నారు. ఈ కేసు విచారణకు సుప్రీంకోర్టు 2026 ఏప్రిల్‌లో కొంత సమయాన్ని ఇచ్చింది. 2018 తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లను ఏప్రిల్ 7 నుండి 9 వరకు విచారిస్తుంది.
వాటిని వ్యతిరేకించే వారి వాదనలను ఏప్రిల్ 14-16 వరకు విచారిస్తుంది. 2019 నవంబర్‌లో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌గొగోరు నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన మెజారిటీ తీర్పు, శబరిమల సమీక్ష, రిట్ పిటిషన్లను ఏడుగురు జడ్జీల ధర్మాసనానికి నివేదించింది. 2018 శబరిమల తీర్పును సమీక్షించాలనే పటిషన్లకు కేంద్ర ప్రభుత్వ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మద్దతు తెలిపారు. అన్ని వయస్సుల మహిళలకు ప్రవేశం అనుమతించిన తీర్పును మళ్లీ పరిశీలించాలని సూచించారు.

More Stories
ఏఐపై చర్చకు ప్రపంచాన్ని ఒకే వేదికపై తీసుకువస్తున్నాం
‘వైట్ కాలర్’ టెర్రర్ మాడ్యూల్ ‘అన్సార్ ఇంటీరియం’
రైతుల ప్రయోజనాలపై రాహుల్, అమిత్ షా మాటల యుద్ధం