రూ.లక్ష కోట్లతో అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌

రూ.లక్ష కోట్లతో అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌

మార్కెట్‌ నుంచి 50 శాతం అప్పులు తీసుకున్న పట్టణాలను అభివృద్ధి చేసేందుకు రూ.లక్ష కోట్ల అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌ (యుసిఎఫ్‌)కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశమైంది. అనంతరం నేషనల్‌ మీడియా సెంటర్‌ (ఎన్‌ఎంసి)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించారు. 

పట్టణాల్లో మౌలిక సదుపాయాలకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆర్థిక సహాయం అందించేందుకు, నిధులు కేటాయించే విధానాలకు కేంద్రం స్వస్తి పలికింది. పట్టణాల అభివృద్ధికి చేపట్టనున్న ప్రాజెక్టుల వ్యయం లో కేంద్ర ప్రభుత్వ సహాయం 25 శాతమే ఉంటుంది. మార్కెట్‌ నుండి కనీసం 50 శాతం నిధులను అప్పుల రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది.

మున్సిపల్‌ బాండ్లు, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాల రూపంలో ఈ పెట్టుబడులు సేకరిస్తారు. వచ్చే ఐదేళ్లలో పట్టణాల్లో రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ ఫండ్‌ 2025-26 నుండి 2030-31 వరకు పనిచేస్తోంది. అమలు వ్యవధిని 2033-34 వరకు పొడిగించవచ్చు. స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌కు వెంచర్‌ క్యాపిటల్‌ సమీకరణ ఉద్దేశంతో రూ.10 వేల కోట్ల కార్పస్‌ ఫండ్‌తో స్టార్టప్‌ ఇండియా ఫండ్‌ ఆఫ్‌ ఫండ్స్‌ 2.0 ఏర్పాటుకు కేంద్రమంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇది ఆవిష్కరణ ఆధారిత అభివృద్ధి అజెండాలను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.

అస్సాంలో బ్రహ్మపుత్ర నది కింద రెండు లైన్ల ట్విన్‌ ట్యూబ్‌ టిబిఎం రోడ్డు అండర్‌ వాటర్‌ రివర్‌ టన్నెల్‌ నిర్మాణానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సిసిఇఎ) ఆమోదం తెలిపింది. బ్రహ్మపుత్ర నది కింద 15.79 కిలో మీటర్ల రోడ్‌ కమ్‌ రైల్‌ టన్నెల్‌ ను రూ.18,662 కోట్లతో నిర్మించనున్నారు. ఈ టన్నెల్‌ నిర్మాణంతో 250 కిలోమీటర్ల దూరం తగ్గనుంది.

ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని 12 జిల్లాలను కవర్‌ చేసే మూడు మల్టీ ట్రాకింగ్‌ ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సిసిఇఎ) ఆమోదం తెలిపింది. దీంతో దాదాపు 389 కిలోమీటర్ల మేర రైల్వే నెట్‌ వర్క్‌ పెరుగుతుంది. మొత్తం అంచనా వ్యయం రూ.18,509 కోట్లు కాగా, ప్రాజెక్టు 2030-31 నాటికి పూర్తి అవుతుంది.

గుజరాత్‌ లో జాతీయ రహదారి 56 విస్తరణ కోసం రూ.4,583 కోట్లకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సిసిఇఎ) ఆమోదం తెలిపింది. గుజరాత్‌ లోని ధమాసియా- బిటాడా – నాసర్‌ పూర్‌-మలోథా సెక్షన్‌ మధ్య నాలుగు లైన్ల నిర్మాణానికి రూ.4,583.64 కోట్లను ఖర్చు చేయనుంది. మహారాష్ట్రలోని జాతీయ రహదారి-160ఎ విస్తరణకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సిసిఇఎ) ఆమోదం తెలిపింది. 

మహారాష్ట్రలోని గోతి- త్రింబక్‌- జవహర్‌-మనోర్‌-పాల్ఘర్‌ సెక్షన్‌ ఇంజనీరింగ్‌, సేకరణ, నిర్మాణం (ఈపిసి) మోడ్‌ కు సంబంధించిన పునరావాసం, అప్‌ గ్రేడ్‌ కోసం రూ.3,320.38 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. తెలంగాణలోని గూడె బేల్లూరు నుండి మహబూబ్‌ నగర్‌కు జాతీయ రహదారికి రూ.3,175 కోట్లు కేటాయించారు. నోయిడా మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.