మణిపూర్‌లో 2023 మేలో తలెత్తిన జాతుల మధ్య హింసాకాండ సందర్భంగా లైంగిక దాడులు, మహిళలపై సామూహిక అత్యాచారాలతో సహా వివిధ హేయమైన నేరాల్లో నిందితులైన వ్యక్తులను దోషులుగా నిర్ధారించడానికి తగిన సాక్ష్యాధారాలను సంస్థ సేకరించిందో లేదో తెలియచేస్తూ ఒక నివేదికను అందచేయాలని సిబిఐని సుప్రీం కోర్టు ఆదేశించింది.
చట్ట ప్రకారం కేసుల చార్జిషీట్ల కాపీలను బాధితులు లేదా వారి కుటుంబ సభ్యులతో సిబిఐ పంచుకోవాలని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది.ఈ క్రిమినల్ కేసుల్లో పురోగతిని నిశితంగా పర్యవేక్షించే బాధ్యతలను మణిపూర్, గౌహతి హైకోర్టుల చీఫ్ జస్టిస్‌లకు అప్పగించాలని సుప్రీం ప్రతిపాదించింది. అవసరమైతే బాధితులకు నాణ్యతతో కూడిన లీగల్ ఎయిడ్‌ను అందించాలని బెంచ్ కోరింది.
మణిపూర్ ఘర్షణల్లో లైంగిక దాడులకు గురైన యువతుల తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది వృందా గ్రోవర్ ఇందుకు సంబంధించి జరుగుతున్న జాప్యాలను ప్రస్తావించిన తర్వాత సుప్రీం ఈ విచారణలను వేగవంతం చేసింది. జాతుల మధ్య హింసాకాండ తలెత్తిన రోజుల్లో సామూహిక అత్యాచారానికి గురైన ఒక యువతి ఆ మానసిక వేదనతో,అస్వస్థతతో ఈ ఏడాది జనవరిలో మరణించింది. గ్రోవర్ ఆ కేసును ప్రముఖంగా ప్రస్తావించారు.
ఇలాంటి కేసులు సిబిఐకి 11వరకు బదిలీ అయ్యాయని ఆమె తెలిపారు. తమపై మోపిన అభియోగాలేమిటో బాధితులు తెలుసుకునే హక్కు చట్ట ప్రకారం వుందని కానీ ఈ విషయంలో తాము పూర్తిగా చీకటిలో వున్నామని ఆమె పేర్కొన్నారు. అధికారులు చాలా యథాలాపంగా వ్యవహరించడం దిగ్భ్రాంతి కలిగిస్తోందని ఆమె తెలిపారు.
దీనిపై చీఫ్ జస్టిస్ స్పందిస్తూ ప్రతి ఒక్కరూ న్యాయం పొందేలా చూడాల్సిన బాథ్యత వుందని వ్యాఖ్యానించారు. మణిపూర్‌లో హింసకు సంబంధించిన సున్నితమై, హేయమైన కేసులను అస్సాంకు బదిలీ చేసి అక్కడ విచారించాలని సుప్రీం పేర్కొంది. అవసరమైతే ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయడం ద్వారా విచారణను అస్సాం చీఫ్ జస్టిస్ పర్యవేక్షించగలరని పేర్కొంది.

More Stories
టీమ్ఇండియాకు బీసీసీఐ రూ. 131 కోట్ల నజరానా
ఇరాన్ భారీ అణు నిల్వలపై ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’
పశ్చిమాసియాలో తీవ్రమైన మానవత్వ అత్యవసర పరిస్థితి