భారత్ “విజయవంతమైన” అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ

భారత్ “విజయవంతమైన” అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ
భారతదేశం ప్రపంచ వ్యవహారాల్లో విస్తరిస్తున్న ప్రభావంతో “చాలా విజయవంతమైన” అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్  అభివర్ణించారు. ఏఐ ఇంపాక్ట్ సదస్సు- 2026 లాంటి అంతర్జాతీయ స్థాయి కీలక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు భారతే సరైన చోటు అని ఆయన పేర్కొన్నారు. 
 
ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు న్యూదిల్లీ వేదికగా ప్రతిష్ఠాత్మకమైన ఏఐ ఇంపాక్ట్ సదస్సు- 2026 జరుగుతున్న సందర్భంగా ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ ఏఐ మానవాళి అందరికీ సేవ చేయాలని నొక్కి చెప్పారు.  “కుత్రిమ మేధస్సు (ఏఐ) అనేది యావత్ ప్రపంచానికి ప్రయోజనాన్ని చేకూర్చాలి. కేవలం అభివృద్ధి చెందిన దేశాలకో, రెండు సూపర్ పవర్‌లకో(అమెరికా, చైనా) అది పరిమితం కాకూడదు” అని ఆయన స్పష్టం చేశారు. 
 
“ఏఐ ఎవరో కొందరి సొత్తు కాదు. అది యావత్ ప్రపంచానిది. ప్రపంచంలో ప్రతీచోటా, ప్రతీ ఒక్కరికీ ఏఐ టెక్నాలజీ ఉపయోగపడాలి. ఏఐ అనేది మానవాళి శ్రేయస్సు కోసం దోహదపడే సార్వత్రిక ఉపకరణంగా మారాలి. గ్లోబల్ సౌత్ పరిధిలోని దేశాలకూ ఏఐ ఫలాలు లభించాలి” అని ఆశాభావం వ్యక్తం చేశారు.  ఇందులో పాల్గొనేందుకు తాను కూడా ఢిల్లీకి వెళ్తున్నానని చెబుతూ  భారత్‌లో జరగనున్న సదస్సులో ఏఐ వినియోగంపై కూలంకషమైన చర్చలు జరుగుతాయని, ఏఐను వినియోగించే క్రమంలో ఎదురయ్యే సవాళ్లు, ముప్పులపైనా చర్చ జరుగుతుందని గుటెరెస్ తెలిపారు.

పారదర్శకంగా అన్ని దేశాలకు సమ ప్రాధాన్యత లభించాలంటే ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, అభివృద్ధిచెందుతున్న దేశాలకు బలంగా వాణిని వినిపించే అవకాశం లభించాలని ఆయన చెప్పారు. ప్రపంచంలో అభివృద్ధిచెందుతున్న దేశాలకు కేంద్ర బిందువుగా భారత్ కనిపిస్తోందని పేర్కొంటూ ఈ అంశంపై తాను భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతో చర్చిస్తానని పేర్కొన్నారు. 

బహుళ ధ్రువ ప్రపంచం సాకారంలో భారత్ కీలక పాత్రను పోషిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ వైవిధ్యం, అద్భుత నాగరికత, సంస్కృతిలకు భారత్ నెలవని పేర్కొంటూ గత కొన్ని శతాబ్దాల్లో ప్రపంచ వికాసంలో భారత్ పోషించిన పాత్రపై ప్రస్తుతం తాను కొన్ని పుస్తకాలు, నివేదికలను చదువుతున్నానని చెప్పారు.  క్రీస్తు పూర్వమే చైనా, ఆగ్నేయ ఆసియా, హిందూ మహాసముద్ర ప్రాంత దేశాలపైనా భారత నాగరికత, సంస్కృతిల ప్రభావం పడిందని పేర్కొన్నారు. రోమన్ సామ్రాజ్య కాలంలోనూ మధ్యధరా సముద్ర ప్రాంత దేశాలతో భారత్‌కు బలమైన వాణిజ్య అనుబంధం ఉండేదని ఐరాస చీఫ్  తెలిపారు.

“ఈ ప్రపంచంలో రెండు అంశాలు జరగకుండా మనం అడ్డుకోవాలి. యావత్ ప్రపంచ వ్యవహారాలపై పెత్తనం ఒకే దేశం చేతిలో అస్సలు ఉండకూడదు. యావత్ ప్రపంచం రెండు సూపర్ పవర్‌‌ల మధ్య విభజితమై కూడా ఉండకూడదు. బహుళ ధ్రువ ప్రపంచాన్ని బలంగా కోరుకునే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని” అని స్పష్టం చేశారు. 

బహుళ ధ్రువ ప్రపంచం ఏర్పడాలంటే అభివృద్ధిచెందుతున్న దేశాలకు వాణిజ్యం, టెక్నాలజీ, అంతర్జాతీయ సంబంధాలలో చాలాచాలా కీలకమైన పాత్రలను పోషించే అవకాశాలు లభించాలని ఆయన సూచించారు. ఇటీవలే భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందమే అందుకు మంచి ఉదాహరణ అని చెప్పారు. 

భారత్ వికాసాన్ని యావత్ ప్రపంచం గుర్తిస్తోందని, ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రత్యేక సమూహాలుగా ఏర్పడుతున్నాయని ఆయన తెలిపారు. ఈ సమూహాల వల్లే నిజమైన బహుళ ధ్రువ ప్రపంచం దిశగా బాటలు పడుతున్నాయని చెప్పారు. దీనివల్ల ఏదో ఒక దేశం పెత్తనానికి అవకాశం లేకుండా పోతోందని ఐరాస చీఫ్ చెప్పారు.

ప్రపంచ శాంతి, భద్రతల పరిరక్షణలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి విఫలం కావడం పట్ల ఆయన ఆందోళనకర వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల మధ్య సైనిక ఘర్షణలను అది ఆపలేకపోతోందని, సరైన నిర్ణయాలను తీసుకునే స్థితిలో ఐరాస భద్రతా మండలి లేదని విచారం వ్యక్తం చేశారు. అందుకే దానిలో ప్రాథమిక సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందని పిలుపిచ్చారు.

“రెండో ప్రపంచ యుద్ధం తర్వాతి కాలం నాటి పరిస్థితులకు అనుగుణంగా ఏర్పడిన భద్రతా మండలి అది. కానీ మనకు నేటి పరిస్థితులకు అనుగుణమైన ఐరాస భద్రతా మండలి కావాలి. ప్రపంచ శాంతి, భద్రతల పరిరక్షణ కోసం సముచిత నిర్ణయాలను తీసుకునే రీతిలో భద్రతా మండలి నిర్మాణ స్వరూపం ఉండాలి” అని ఆంటోనియో గుటెరెస్ పేర్కొన్నారు.