బంగ్లాదేశ్ లో ముగ్గురు హిందువులు ఘన విజయం

బంగ్లాదేశ్ లో ముగ్గురు హిందువులు ఘన విజయం
 
* జమాతే ఇస్లామీ పార్టీ ఏకైక హిందూ అభ్యర్థి ఓటమి 
బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో నలుగురు హిందువులు ఎంపీలుగా గెలిచారు. బీఎన్పీ పార్టీ తరఫున ఢాకా-3 పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసిన గాయేశ్వర్ చంద్ర రాయ్ ఘన విజయం సాధించారు. జమాతే ఇస్లామీ నేత మహమ్మద్ షాహినూర్ ఇస్లాంపై 99వేలకుపైగా ఓట్ల తేడాతో గెలుపొందారు.  బీఎన్పీ వైస్-చైర్మన్ నిత్యా రాయ్ చౌదురి మగురా-3 నుంచి, రంగమతి నుంచి దీపేస్ దేవాన్‌లు, బందర్బన్ నుంచి సచింగ్ ప్రూ చట్టసభకు ఎన్నికయ్యారు.
వీరి విజయం బంగ్లా పార్లమెంటులో హిందువుల గొంతుకను వినిపిండానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.  గయేశ్వర్ చంద్ర రాయ్ 1951, నవంబర్‌ 1న ఢాకాలోని కెరానిగంజ్‌‌లో జన్మించారు. తల్లిదండ్రులు జ్ఞానేంద్ర చంద్ర రాయ్, సుమతి రాయ్. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే ఆయన రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. 1978లో యువత ఏర్పాటుచేసిన బంగ్లాదేశ్ జాతీయతవాది జుబో డాల్‌‌లో చేరారు. దాని ప్రధాన కార్యదర్శిగానూ ఉన్నారు. 
 
1991 బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఖలీదా జియా నాయకత్వంలోని బీఎన్పీ  ప్రభుత్వం  ఏర్పడిన తర్వాత  టెక్నోక్రాట్ కోటాలో అటవీ, పర్యావరణ శాఖ, మత్స్య, పశుసంవర్దక శాఖల సహాయ మంత్రిగా ఉన్నారు. పార్టీలోనూ ఆయన కీలక పదవుల్లో పనిచేశారు. జాయింట్ సెక్రెటరీగా, పార్టీ స్టాండ్ కమిటీ సభ్యుడిగానూ 1990వ దశకంలో కీలక పాత్రలు పోషించారు.
 
తొలిసారి 2008 బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో ఢాకా-3 నుంచి బీఎన్పీ నుంచి పోటీచేసి అవామీ లీగ్ అభ్యర్థి చేతిలో పరాజయం పొందారు. మళ్లీ 2018లోనూ రాయ్‌ను బీఎన్పీ పోటీకి దింపింది. బీఎన్పీ అగ్రనాయకత్వంతోనూ గాయేశ్వర్ చంద్ర రాయ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బీఎన్పీ వైస్-ఛైర్మన్ నితాయ్ రాయ్ చౌదరి కుమార్తె నిపున్ రాయ్‌ను గాయేశ్వర్ కుమారుడు అమితాబ్‌ వివాహం చేసుకున్నారు. 
 
కాగా, జమాతే ఇస్లామీ పార్టీ తరఫున ఖుల్నా-1 నుంచి పోటీచేసిన మరో హిందువు కృష్ట నంది ఓటమి చవిచూశారు.  ఈ ఎన్నికల్లో బీఎన్పీ 209 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి రాగా,  జమాతే ఇస్లామీ 68 సీట్లకు పరిమితమైంది. కేవలం ఏడుగురు మహిళలు మాత్రమే చట్టసభకు ఎన్నికయ్యారు. బంగ్లాదేశ్ ఎన్నికల్లో 59 పార్టీలకు చెందిన 1,700 మందికి పైగా అభ్యర్థులు పోటీపడ్డారు.
 

 షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్‌‌పై ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. దీంతో ఎన్నికలకు ఆ పార్టీ దూరంగా ఉంది.  మగురా-2 నుంచి బరిలో నిలిచిన బీఎన్పీ ఉపాధ్యక్షుడు నిత్య రాయ్ చౌదురి జమాతే ఇస్లామీ అభ్యర్థి ముస్తార్షిద్ బిల్లాహ్‌పై 30 వేలకుపైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆయన విజయం మైనారిటీ జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పార్టీ బలమైన పనితీరును మరింత పటిష్టం చేస్తుంది.

రంగమతి స్థానం నుంచి బీఎన్పీ అభ్యర్థిగా పోటీచేసిన హిందూ లాయర్ దీపేన్ దేవాన్ 10 వేలకుపైగా ఓట్ల తేడాత స్వతంత్ర అభ్యర్థి పహేల్ చక్మాను ఓడించారు. సచింగ్ ప్రూ బందార్‌బన్ పార్లమెంట్ స్థానం నుంచి లక్షకుపైగా ఓట్ల తేడాతో నేషనల్ సిటిజన్ పార్టీ అభ్యర్ధి అబూ సయ్యద్ మహ్మద్ సుజాద్దీన్‌పై విజయం సాధించారు.