ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ సహా అఖిల భారత సర్వీసుల్లో 2,880కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రం తెలిపింది. ఐఎఎస్, ఐపిఎస్‌లలో కన్నా అటవీ శాఖలో (ఐఎఫ్ఎస్) అత్యధికంగా అధికారుల కొరత ఉందని, మూడింట ఒక వంతు పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంటూ కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
2025 జనవరి 1 నాటికి ఐఎఎస్‌లో 1300 పోస్టులు, ఐపిఎస్లో 505, ఐఎఫ్ఎస్లో 1029 పోస్టులు కలిపి మొత్తం 2,834 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాధానంలో పేర్కొన్నారు. ఖాళీలు, సేవల ప్రాతినిథ్యంపై పార్లమెంట్లో అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానమిచ్చారు. అందిన సమాచారం ప్రకారం 6,877 ఐఎఎస్ అధికారులకు అనుమతి ఉండగా, ప్రస్తుతం 5,577మంది అధికారులు ఉన్నారు.
మొత్తం 5,099 ఐపిఎస్ పోస్టుల్లో 4,594మంది అధికారులను నియమించారు. అన్ని సేవల్లో, ఐఎఫ్ఎస్లో అతిపెద్ద కొరత ఉంది. 3,193 పోస్టులకు గాను 2,164మంది మాత్రమే ఉన్నారు. ఐఎఎస్ పోస్టులు అత్యధిక సంఖ్యలో ఖాళీలను చూపిస్తున్నప్పటికీ, అటవీ సేవలకు దామాషా ప్రకారం కొరత అత్యధికంగా ఉంది. ప్రతి మూడు అటవీ పోస్టుల్లో సుమారు ఒకటి ఖాళీగా ఉంది. ఐఎఎస్‌కు సంబంధించి ఐదు పోస్టుల్లో ఒకటి ఖాళీగా ఉంది. దీంతో అంతరం మరింత తీవ్రంగా ఉంది.
ఈ సమాచారం ప్రకారం.. అటవీ ప్రాంతం అధికంగా ఉండే రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లు తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నాయి. 2020 నుండి 2024 మధ్య సివిల్ సర్వీస్ పరీక్ష ద్వారా రిజర్వ్ కేటగిరీ నియామకాలకు సంబంధించి గణాంకాలను కూడా ప్రభుత్వం వెల్లడించింది. ఐదేళ్ల కాలంలో, 245 ఒబిసి, 135 ఎస్సి, 67 ఎస్టిఅభ్యర్థులు ఐఎఎస్ అధికారులుగా నియమితులయ్యారు. ఐపిఎస్లో ఒబిసి 255, ఎస్సి 141, ఎస్టి 71అభ్యర్థులను నియమించగా, ఐఎఫ్ఎస్లో 231 ఒబిసి, ఎస్సి95, ఎస్టి48 అభ్యర్థులను ప్రత్యక్ష నియామకం ద్వారా నియమించినట్లు తెలిపింది.

More Stories
మార్చి 9కి పార్లమెంట్ సమావేశాలు వాయిదా
మెరుగైన భారత్ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్
పిఎంఓ నూతన కార్యాలయం సేవా తీర్థ్ ప్రారంభం