114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం

114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం

త్రివిధ దళాల సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా రక్షణ శాఖ రూ.  3.60 లక్షల కోట్ల విలువైన ఆయుధాలు, సైనిక పరికరాల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో సమావేశమైన డిఫెన్స్ అక్వైజిషన్ కౌన్సిల్ (డిఏసీ) సంబంధిత ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. డీఏసీ ఆమోదించిన ప్రతిపాదనల్లో 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్‌ లభించింది. 

అదే విధంగా కాంబాట్‌ క్షిపణులు, ఎయిర్‌షిప్ ఆధారిత హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్ల కొనుగోలుకు అనుమతి లభించింది. వైభవ్‌ యాంటీ ట్యాంక్‌ మైన్స్, పీ-8ఐ విమానాల వంటి కీలక ఆయుధాలకు కూడా డీఏసీ ఆమోదం తెలిపింది. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’కు ఇది మరింత ఊతమిస్తుందని రక్షణశాఖ తెలిపింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు వణుకు పుట్టించిన రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు డీఏసీ ఆమోదం తెలిపింది.

మరికొన్ని రోజుల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ భారత్‌ పర్యటనకు రానున్న వేళ ఈ డీల్‌కు డీఏసీ అమోదం తెలిపింది. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా రఫేల్ విమానాలను భారత్‌లోనే తయారు చేసే విధంగా కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.  విమానాల విడిభాగాల తయారీ కోసం రఫేల్‌ మాతృ సంస్థ డసో ఏవియేషన్‌తో భారత్‌ చర్చలు జరపనుంది. ఫ్రాన్స్‌తో ఈ ఒప్పందం కుదిరితే భారత వైమానిక దళంలో రఫేల్‌ యుద్ధ విమానాల సంఖ్య 150కు చేరుకుంటుంది.

ప్రస్తుతం భారత వాయుసేన దగ్గర 36 రఫేల్‌ యుద్ధ విమానాలు ఉన్నాయి. కాంబాట్‌ క్షిపణుల ద్వారా సుదూర లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించవచ్చని రక్షణశాఖ తెలిపింది. గగనతలంలో నిరంతరం నిఘా ఉంచేందుకు, ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించేందుకు ఎయిర్‌షిప్ ఆధారిత హై ఆల్టిట్యూడ్ సూడో శాటిలైట్లు ఎంతో ఉపయోగపడతాయని వెల్లడించింది. 

స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన విభవ్ యాంటీ- ట్యాంక్ మైన్లు శత్రువుల యుద్ధ ట్యాంకర్‌లను సులభంగా అడ్డుకుంటాయని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న T-72 ట్యాంకులు, ఆర్మోర్డ్ రికవరీ వెహికల్స్, ఇన్‌ఫాంట్రీ కాంబాట్ వెహికల్స్‌లను పూర్తిగా మరమ్మతు చేసి, వాటి జీవితకాలాన్ని పెంచుతామని రక్షణశాఖ తెలిపింది.

సముద్ర జలాల్లో జలాంతర్గాములను పసిగట్టడంలో పీ-8ఐ యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ యుద్ధవిమానం ప్రపంచంలోనే అత్యుత్తమైనదని రక్షణశాఖ స్పష్టం చేసింది. నౌకాదళ అవసరాల కోసం 4 మెగావాట్ల సామర్థ్యం గల మెరైన్ గ్యాస్ టర్బైన్ ఆధారిత జనరేటర్లను స్వదేశీ పరిజ్ఞాతంతో తయారు చేయనున్నట్లు వెల్లడించింది. సముద్ర నిఘా సామర్థ్యాన్ని పెంచేందుకు డోర్నియర్ విమానాలకు ఎలక్ట్రో-ఆప్టికల్ లేదా ఇన్‌ఫ్రా-రెడ్ సిస్టమ్స్‌ను అమర్చనున్నట్లు రక్షణశాఖ తెలిపింది.