* ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలి
విపక్ష నేత రాహుల్ గాంధీ దేశాన్ని తప్పుదారి పట్టించారని ఆరోపిస్తూ ఆయనపై లోక్‌సభలో ఒక ముఖ్యమైన తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు నోటీసు ఇచ్చినట్లు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే గురువారం వెల్లడించారు. రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఆయన ఎన్నికల్లో పోటీచేయకుండా జీవితకాల నిషేధం విధించాలని ఈ నోటీసులో కోరినట్లు ఆయన తెలిపారు.
దేశానికి కీడు చేయాలని చూస్తున్న జార్జి సోరోస్ వంటి శక్తుల సాయంతో దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్న రాహుల్ గాంధీపై లోక్‌సభలో తీర్మానానికి నోటీసు ఇచ్చినట్లు పార్లమెంట్ వెలుపల దూబే వెల్లడించారు. జార్జి సోరోస్ ఓ హంగేరియన్-అమెరికన్ సంపన్న పెట్టుబడిదారుడు, దాత. ఉదారవాదులకు మద్దతు ఇస్తున్నారంటూ ప్రపంచవ్యాప్తంగా మితవాద సంస్థలు తరచుగా సోరోస్‌పై నిందలు వేస్తాయి.
అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుని భారతదేశ ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజీపడిందని రాహుల్ గాంధీ లోక్‌సభలో ఆరోపించిన మరుసటి రోజే బీజేపీ నుంచి ఈ ప్రతిస్పందన వెలువడడం గమనార్హం. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే అముద్రిత పుస్తకం సర్క్యులేషన్ సహా అనేక వివాదాస్పద అంశాలపై రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీల మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర వాగ్వాదం జరిగిన నేపథ్యంలో నిషికాంత్ దూబే ఈ చర్యకు పూనుకున్నారు.
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మాజీ దౌత్యవేత్త, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ పేరు ఉన్నట్లు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం చేసిన ఆరోపణలు సైతం తీవ్ర దుమారాన్ని రేపాయి. రాహుల్ గాంధీకి నిధులు ఎవరు సమకూరుస్తున్నారు? దేశాన్ని నాశనం చేయాలన్న ఉద్దేశం ఎవరిది? ప్రచురించని పుస్తకం రాహుల్ చేతికి ఎలా వచ్చింది? రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని లోక్‌సభ తిరస్కరించాలి అంటూ దూబే డిమాండ్ చేశారు.
రక్షణ, ఆర్థిక, వాణిజ్య, విదేశీ వ్యవహారాల శాఖలు ఏవైనప్పటికీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేయాలన్న ఉద్దేశంతో వివాదాలు సృష్టించే ప్రయత్నాలు చేయడం రాహుల్ గాంధీకి ఇదేమీ కొత్త కాదని దూబే ఆరోపించారు. పార్లమెంట్‌తోపాటు ఇతర ప్రజా వేదికలపైన నిరాధార, అనైతిక ఆరోపణలు చేసి ప్రజల మనోభావాలను రెచ్చగొట్టడంలో రాహుల్ ఆరితేరారని బీజేపీ ఎంపీ తన నోటీసులో పేర్కొన్నారు.
ఈ నెల 11న చేసిన ప్రసంగంలో రాహుల్ గాంధీ వివిధ భారతీయ కార్పొరేట్లను బూచిగా చూపించే ప్రయత్నం చేశారని, బడా వ్యాపార సంస్థలతో వారి కుమ్మక్కు కారణంగా మన బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారని దూబే ఆరోపించారు. పార్లమెంట్ నుంచి అనర్హత వేటు ముప్పును కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎదుర్కోవడం ఇది మొదటిసారి కాదు. 2023 మార్చిలో ప్రధాని నరేంద్ర మోదీని అవమానించే రీతిలో చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పరువునష్టం కేసులో కోర్టు జైలు శిక్ష విధించిన దరిమిలా తన లోక్‌సభ సభ్యత్వాన్ని రాహుల్ కోల్పోయారు.
బ్యాంకులను ముంచి దేశం విడిచి పారిపోయిన ఇద్దరు వ్యాపారుల ఇంటి పేరును ప్రస్తావిస్తూ ఆ ఇంటి పేరు ఉన్న వారంతా దొంగలేనంటూ పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి 2019లో చేసిన వ్యాఖ్యలపై గుజరాత్ కోర్టు రాహుల్‌కు రెండేండ్ల జైలు శిక్ష విధించడంతో రాహుల్‌పై అనర్హత వేటు పడింది. గతంలో చేసిన ఆరోపణల వంటివి కానప్పటికీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌కు సంబంధించి కేంద్ర మంత్రి హర్దీప్ పురీపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు పరువునష్టంగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

More Stories
అఖండ విజయం దిశగా దూసుకుపోతున్న బిఎన్‌పి
కేరళలో మైనారిటీ సమస్యపై ఒకే విధంగా సిపిఎం, బిజెపి?
114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం