దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద గత ఏడాది జరిగిన బాంబు పేలుడు ఘటనపై ఐక్యరాజ్య సమితి కీలక నివేదిక ఇచ్చింది. ఈ పేలుడుతో పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధం ఉన్నదని పేర్కొన్నది. ఆర్థిక ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ జైషే మహ్మద్ తదితర ఉగ్ర ముఠాలు దక్షిణాసియాలో క్రియాశీలంగా నేర కార్యకలాపాలు సాగిస్తున్నాయని తెలిపింది.
ఐరాస విశ్లేషణాత్మక మద్దతు, ఆంక్షల పర్యవేక్షణ బృందం భద్రతామండలికి సమర్పించిన నివేదికలో ఈ విషయాలను ప్రస్తావించింది. నవంబర్ 10 సాయంత్రం లాల్ క్విలా మెట్రో స్టేషన్ సమీపంలో నెమ్మదిగా కదులుతున్న హ్యుందాయ్ ఐ20 కారులో శక్తివంతమైన పేలుడు సంభవించి 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
“ఆంక్షలు ఉన్నప్పటికీ జైషే ముఠా పలు ఉగ్రదాడులకు పాల్పడినట్లు తెలుస్తున్నది. 2025 నవంబర్ 10న ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన ఆత్మాహుతి దాడి అందులో ఒకటని ఒక సభ్యదేశం ఆరోపించింది. అంతర్జాతీయ నిఘా నుంచి తప్పించుకునేందుకు జైషే కొత్త పన్నాగాలు పన్నుతోంది. గత ఏడాది జమాత్ ఉల్ ముమినత్ పేరుతో మహిళా వింగ్‌ను ఏర్పాటు చేసుకుంది. ఇది చాలా ఆందోళనకర పరిణామం” అని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో పేర్కొన్నది.
జమ్ముకశ్మీర్‌లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను కూడా యూఎన్వో తన నివేదికలో ప్రస్తావించింది. ఆ దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు హతమైనట్లు తెలిపింది. కాగా జైషే, లష్కరే తాయిబా వంటి ఉగ్ర ముఠాలు ఉనికిలో లేవని గత కొంతకాలంగా పాకిస్థాన్ పదేపదే వాదిస్తూ వస్తున్నది. ఈ క్రమంలో తాజాగా ఐక్యరాజ్యసమితి ఇచ్చిన నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నివేదికతో దాయాది పాకిస్థాన్ వక్రబుద్ధి బయటపడింది.
కాగా ఎర్రకోట వద్ద పేలుడు ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడి వెనక జైషే మహ్మద్ హస్తం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఎర్రకోట వద్ద ఆత్మాహుతి చేసుకున్న ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీకి సంబంధించిన ఓ వీడియోను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారత్ అంతటా ఆత్మాహుతి దాడులకు ఈ ముఠా కుట్రలు పన్నినట్లు ఆ వీడియోలో ఉంది. దానిపై దర్యాప్తు కొనసాగుతున్నది.

More Stories
ఇకపై స్కూళ్లలో వందేమాతరం తప్పనిసరి
పిల్లల అదృశ్యం వెనుక జాతీయ స్థాయిలో నెట్వర్క్?
ఆలయ ఉత్సవంలో తొక్కిసలాట.. మహిళ మృతి