యూకే ఎగువ సభకు ఉదయ్‌ నాగరాజు

యూకే ఎగువ సభకు ఉదయ్‌ నాగరాజు
* భగవద్గీతతో తెలంగాణవాసి ప్రమాణస్వీకారం
 
బ్రిటిష్‌ పార్లమెంట్‌ ఎగువ సభ అయిన ‘యూకే హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌’లో లైఫ్‌ పీర్‌గా తెలంగాణ వాసి ఉదయ్‌ నాగరాజు ప్రమాణం చేశారు. ఈ సభలో చట్టాలను రూపొందించడం, ప్రభుత్వాన్ని పర్యవేక్షించడం, ముఖ్యమైన అంశాలపై చర్చించడం వంటి ప్రధాన విధులను నిర్వహిస్తారు. సాంస్కృతిక వారసత్వం ప్రతిబించించేలా ప్రజా సేవ పట్ల నిబద్ధతను సూచిస్తూ ఆయన భగవద్గీతపై ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు.

హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ చారిత్రాత్మక గదిలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనను ప్రతినిధులు అధికారికంగా పరిచయం చేశారు. అంతకుముందు ఊరేగింపు నిర్వహించారు. యూకే ప్రధాన మంత్రి కీర్‌ స్టార్మర్‌ సలహా మేరకు రాజు ఛార్లెస్‌-III ఉదయ్‌ నాగరాజుకు పీరేజ్‌ను ప్రదానం చేశారు. ఇక నుంచి ఆయనను అధికారికంగా బ్లూమ్స్‌బరీ లార్డ్‌ నాగరాజుగా పిలువనున్నారు. 

హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌లో చేరిన అతి పిన్న వయసుడ్కిగా ఉదయ్‌ నాగరాజు ఘనత సాధించారు. పాలన, విద్య, విధానం, సామాజిక ఆవిష్కరణలు సహా ప్రజా జీవితంలో విశిష్ట సేవ, నాయకత్వాన్ని ప్రదర్శించిన వ్యక్తులకు లైఫ్‌ పీర్‌లను ప్రదానం చేస్తారు. లైఫ్‌ పీర్‌గా లార్డ్‌ నాగరాజు జీవితాంతం హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌లో తన సేవలు అందించనున్నారు. ఈయన కొన్నేళ్ల క్రితం బ్రిటన్‌ దిగువసభ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌కు పోటీచేసినా కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు.

సిద్ధిపేటలోని కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన హనుమంతరావు, నిర్మలాదేవి దంపతుల కుమారుడు ఉదయ్‌ నాగరాజు. ఆయనకు భార్య గౌరి, కుమార్తె ఉన్నారు. వరంగల్‌, హైదరాబాద్‌లో ప్రారంభ జీవితం ఆయనలో బలమైన సమాజ విలువలు, క్రమశిక్షణ ప్రజా బాధ్యత నింపాయి. మహారాష్ట్రలోని కిట్స్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. తర్వాత ఆక్స్‌ఫర్డ్‌ బ్రూక్స్‌ విశ్వవిద్యాలయంలో ఐటీ చేశారు. 

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ లండన్‌(యూసీఎల్‌)లో పాలనా శాస్త్రంలో పీజీ పూర్తి చేశారు. చిన్ననాటి నుంచి కష్టపడేతత్వం కలిగిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. ప్రపంచ రాజకీయాలపై పూర్తి అవగాహన ఏర్పర్చుకున్నారు. ప్రపంచం, భావితరాలపై కృతిమ మేధ(ఏఐ) ప్రభావాన్ని ముందుగానే పసిగట్టి ‘ఏఐ పాలసీ ల్యాబ్స్‌’ అనే థింక్‌ ట్యాంక్‌ను నెలకొల్పారు. 

అంతర్జాతీయ వక్తగా, రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. స్కూల్‌ గవర్నర్‌, వలంటీర్‌, విస్తృత రాజకీయ ప్రచారకుడిగా దాదాపు దశాబ్దం పాటు ఇంటింటికీ తిరిగి పనిచేశారు. క్షేత్రస్థాయి సమస్యలపై పట్టు సాధించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, రాజ్యసభ మాజీ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీ కాంతారావుకు ఈయన సమీప బంధువు