భారీ ఉగ్ర కుట్రను పంజాబ్ పోలీసుకు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ విభాగం భగ్నం చేసింది. పంజాబ్, దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదిని అరెస్టు చేసింది. అతడి నుంచి రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేసే ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ), విదేశీ పిస్టల్, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుంది.
ఈ ఉగ్ర కుట్రపై పంజాబ్‌లోని అమృత్సర్ కేంద్రంగా పనిచేసే స్పెషల్ ఆపరేషన్స్ విభాగానికి నిఘా వర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. దాని ప్రకారం పకడ్బందీ ప్లాన్‌తో ఆపరేషన్‌ను నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తెలుపుతూ పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఓ ఉగ్రవాది సహకారంతో నిందితుడు భారత్‌లో ఉగ్రదాడులకు ప్రణాళిక రచించాడని దర్యాప్తులో గుర్తించామని ఆయన వెల్లడించారు.
ఎన్క్రిప్టెడ్ సోషల్ మీడియా వేదికల ద్వారా పాక్ ఉగ్రవాదితో నిందితుడు నిత్యం ఛాటింగ్ చేసే వాడని డీజీపీ తెలిపారు. ఉగ్రదాడికి అవసరమైన పేలుడు సామగ్రిని పాక్ బార్డర్ మీదుగా భారత్‌లోకి పంపించారని చెప్పారు. అమృత్సర్ నగర శివారులోని ఓ నిర్దిష్ట ప్రదేశంలో ఈ సామగ్రిని నిందితుడికి అందించారని తెలిపారు.
భారత్‌లోని పంజాబ్, దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఉగ్రదాడులు చేసేందుకు ఈ ఐఈడీ, మందుగుండు సామగ్రి, పిస్టల్‌లను వినియోగించాలని నిందితుడు భావించాడని డీజీపీ పేర్కొన్నారు. దీనిపై అమృత్‌సర్‌లోని స్టేట్ స్పెషల్ ఆపరేషన్స్ సెల్ (ఎస్ఎస్ఓసీ) పోలీసు స్టేషనులో ఎఫ్ఐఆర్ను నమోదు చేశామన్నారు. ఈ ఉగ్ర నెట్‌వర్క్‌లోని మిగతా వారిని గుర్తించేందుకు ప్రస్తుతం ముమ్మర దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.

More Stories
రాహుల్ గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
రాహుల్ గాంధీవి అర్థంలేని ఆరోపణలు
డిఎంకె పొత్తులు మాత్రమే.. పాలనలో భాగస్వామ్యం లేదు