డిఎంకె పొత్తులు మాత్రమే.. పాలనలో భాగస్వామ్యం లేదు

డిఎంకె పొత్తులు మాత్రమే.. పాలనలో భాగస్వామ్యం లేదు
ఈ ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఇతర పార్టీలతో డిఎంకె పొత్తు పెట్టుకుంటుంది. కానీ ఆ పార్టీలను పాలనలో భాగస్వామ్యం చేసుకోదు. ఎందుకంటే అది తమిళనాడుకు వర్తించకపోవచ్చు అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్‌ స్పష్టం చేశారు. ఆయన ఇండియా టుడే కాన్‌క్లేవ్‌ లో ఎన్నికల పొత్తుకు సంబంధిచిన విషయాలపై మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో డిఎంకెనే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేల్చి చెప్పారు. 
 
ఇటీవల కాలంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో గెలిస్తే కాంగ్రెస్‌కి మంత్రి పదవుల్ని కేటాయించాలనే డిమాండ్‌ ముందుకు వచ్చింది. ఈ విధమైన ప్రచారానికి స్టాలిన్‌ చెక్‌ పెట్టారు. అయితే, కాంగ్రెస్‌ కచ్చితంగా డిఎంకె కూటమిలో ఉంటుందని, కాంగ్రెస్‌తో కనిమొళి చర్చలు కూడా జరుపుతోందని ఆయన తెలిపారు. 
 
“రాహుల్‌గాంధీ నాకు సోదరుడిలాంటివాడు. ఆయన మా కుటుంబ సభ్యుడు. మా సంబంధం రాజకీయాలకు అతీతమైనది” అని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా డిఎంకెనే మరోసారి గెలుస్తుందని, ప్రజలు డిఎంకెని గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల పొత్తుపై ఫిబ్రవరి 22న జరిగే చర్చలు కూడా విజయవంతంగా ముగుస్తాయని ఆయన చెప్పారు. 
 
తమిళనాడు రెండంకెల వృద్ధిని సాధించిందని, ఆ రాష్ట్ర తలసరి ఆదాయం జాతీయ వృద్ధిరేటు 1.74 శాతం కంటే ఎక్కవగా ఉందని స్టాలిన్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక అడ్డంకులు సృష్టించినా డిఎంకె ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలిపారు. ఎన్‌డిఎ పాలన డబుల్‌ ఇంజిన్‌ కాదు. డిఫెక్టివ్‌ ఇంజన్‌ అని ఆయన అభివర్ణించారు.