కందుల జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం

కందుల జాహ్నవి కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం

అమెరికాలో ఒక పోలీసు అధికారి నిర్లక్ష్యం కారణంగా మరణించిన తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి కేసులో ఆమె కుటుంబానికి సుమారు రూ.262 కోట్లు (అమెరికా కరెన్సీలో 29 మిలియన్ డాలర్లు) పరిహారం చెల్లించేందుకు సియాటెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు బుధవారం (అమెరికా కాలమానం ప్రకారం) సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ ప్రకటన విడుదల చేశారు.

కందుల జాహ్నవి మృతి చెందడం అత్యంత బాధాకరమని, ఈ పరిష్కారం​ ఆమె కుటుంబానికి కాస్త ఉపశమనం కలిగిస్తుందని ఆశిస్తున్నట్లు సియాటెల్ అటార్నీఆ  ప్రకటనలో పేర్కొన్నారు. అయితే దీనిపై జాహ్నవి కుటుంబం తరఫున అటార్నీ నుంచి ఇంత వరకు కూడా ఎటువంటి స్పందన లేదు. ఈ కేసులో పరిహార ఒప్పందం కోసం ఇరుపక్షాలు గత వారం కోర్టులో దరఖాస్తు చేసినట్లు సమాచారం.

 ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి (23) ఉన్నత చదువుల కోసం 2021లో అమెరికాకు వెళ్లింది. ఆమె సౌత్​లేక్ యూనియన్​లోని నార్త్ ఈస్ట్రన్​ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీలో చేరింది. 2023 జనవరి 23న రాత్రి, జాహ్నవి రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న పోలీసు పెట్రోలింగ్ వాహనం ఆమెను ఢీకొట్టింది.

ఈ ఘటనలో జాహ్నవి తీవ్రంగా గాయపడింది. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదానికి కారణమైన పోలీసు అధికారి కెవిన్ డవే. జాహ్నవి మరణం గురించి జోక్ చేయడం అప్పట్లో తీవ్ర వివాదానికి దారి తీసింది. ‘ఆమె ఓ సాధారణ వ్యక్తి. ఈ మరణానికి విలువ లేదు’ అని పోలీస్ అధికారి అన్న మాటలు ఆయన బాడీ కెమెరాలోనే రికార్డు అయ్యాయి. దీనిపై అప్పట్లో ఇండియా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కెవిన్ తీరు పై అమెరికాలోనూ విమర్శలు వెల్లువెత్తాయి. ఫలితంగా అతన్ని విధుల నుంచి తొలగించారు.

ప్రమాదం జరిగిన ప్రాంతం 40 కి.మీ. జోన్​లో ఉండగా, కెవిన్ గంటకు 119 కి.మీ. వేగంతో వాహనం నడుపుతూ జాహ్నవిని ఢీకొట్టాడు. ఆమె 100 అడుగుల దూరం ఎత్తుకు ఎగిరి పడినట్లు గతంలో వార్తలు వచ్చాయి. మరోవైపు ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల డవేపై అభియోగాలు మోపడం లేదని పేర్కొంటూ, కింగ్ కౌంటీ ప్రాసిక్యూటింగ్ కార్యాలయం ఓ ప్రకటన గతంలో విడుదల చేసింది.