తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయ పట్టును కోల్పోతామనే భయంతోనే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పలు అరాచకాలకు పాల్పడిందని, పోలింగ్ రోజున కూడా అనేక కేంద్రాల్లో బిజెపి కార్యకర్తలపై దాడులు చేసి, పోలింగ్ సెంటర్ల వద్ద నుంచి వెళ్లగొట్టే ప్రయత్నాలు జరిగాయని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయినప్పటికీ బిజెపి కార్యకర్తలు వెనుకడుగు వేయకుండా ధైర్యంగా నిలబడ్డారని చెబుతూ ఈ ఘటనలపై స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. డబ్బు, అధికారబలం, అధికార మదంతో గెలవాలని ప్రయత్నించిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్య పాఠం చెప్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పోలింగ్ బూత్‌ల వద్ద బహిరంగంగా, పోలీసుల సమక్షంలోనే, బూత్‌ల లోపల, బయట విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ చేసిందని పేర్కొంటూ దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ లేదా పోలీసుల నుంచి సరైన స్పందన రాలేదని ఆయన ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిజంగా పనిచేస్తుందా? అనే అనుమానం వ్యక్తం చేశారు. నారాయణఖేడ్, సుల్తానాబాద్, చెన్నూరు, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, ఖానాపూర్, సదాశివపేట్, ఎల్లంపేట్, వైరా, కొత్తగూడెం, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బెదిరింపులు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ ఈ చర్యలకు పాల్పడ్డారని స్పష్టం చేశారు.
ఒకవైపు ధన ప్రలోభాలు, మరోవైపు పోలీసు ఒత్తిళ్లు, నాయకుల బెదిరింపులు-ఇవన్నింటిని భరించి కూడా బిజెపి కార్యకర్తలు పార్టీ కోసం అంకితభావంతో కృషి చేశారని ఆయన కొనియాడారు. ఎన్నికల ముందు రోజు మక్తల్‌లో కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుకునే ప్రయత్నంలో బిజెపి కార్యకర్తలపై బెదిరింపులకు, అధికార దుర్వినియోగానికి, ప్రచార సమయంలో అనేక అరాచకాలకు పాల్పడిందని రామచందర్ రావు మండిపడ్డారు.
మక్తల్‌లో బిజెపి అభ్యర్థి మహదేవప్ప మరణం ఆత్మహత్య కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ హత్యగానే తాము భావిస్తున్నామని స్పష్టం చేశారు. మంచిర్యాలలో కూడా బిజెపి కార్యకర్తలు, నాయకులను బెదిరింపులతో వేధించారని, ఇండ్లపై దాడులు చేసిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని చెబుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేల డైరెక్షన్లతో పోలీసులు పనిచేయడం అప్రజస్వామిక చర్య అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక స్థానాల్లో ఓటమి తప్పదని, బీఆర్ఎస్ పార్టీ కూడా అరకొర తప్పితే గెలిచేదేమీ లేదని స్పష్టం చేశారు. ఖచ్చితంగా బిజెపి అనేక కీలక స్థానాల్లో విజయాన్ని సాధిస్తుందని భరోసా వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని బిజెపి కార్యకర్తలపై దాడులు చేస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు. బిజెపి కార్యకర్తలు ప్రతిఘటించి, ఎదురుతిరిగితే పరిస్థితులు దారుణంగా ఉంటాయని తేల్చి చెప్పారు. బిజెపి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నాయకులు వేధింపులకు భయపడి ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని చెబుతూ పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను అశాస్త్రీయంగా మూడు భాగాలుగా విభజించిందని విమర్శించారు. తమ రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కార్పొరేషన్‌ను దారుస్సలాం కేంద్రంగా ఉన్న మజ్లిస్ పార్టీకి కట్టబట్టే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కోర్ హైదరాబాద్‌ను మజ్లిస్‌కు తాకట్టుపెట్టే విధంగా జీహెచ్ఎంసీని విభజించి, జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ గా చేశారని తెలిపారు.
పోలీసుల సమక్షంలో పోలింగ్ బూత్‌ల లోపల, వెలుపల డబ్బును నిర్లక్ష్యంగా పంపిణీ చేశారని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. అనేక ఫిర్యాదులు వచ్చినప్పటికీ, రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసులు స్పందించలేదని పేర్కొంటూ రాష్ట్రంలో ఎన్నికల సంఘం అంటూ ఉందా లేదా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండూ డబ్బుపై మాత్రమే ఆధారపడి ఉన్నాయని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.
ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించడం, బిఆర్ఎస్ కు మద్దతు లేకపోవడం చూసి, వారు హింస, ఆర్థిక ప్రభావాన్ని ఆశ్రయించారని ఆరోపించారు. కాగా, డిసెంబర్ 31, 2025 తర్వాత మే 2027 వరకు పరిపాలనా సరిహద్దుల్లో ఎటువంటి మార్పులు చేయకూడదని జనాభా లెక్కల డైరెక్టరేట్ స్పష్టంగా పేర్కొందని గుర్తు చేశారు.
అయినా, గజ్వేల్, నల్గొండ, హైదరాబాద్‌లోని కార్పొరేషన్‌లను పునర్నిర్మించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించిందని ఆయన మండిపడ్డారు. మజ్లిస్ పార్టీ ఒత్తిడితో, ప్రభుత్వం రాజేంద్రనగర్, మహేశ్వరం వంటి మజ్లిస్ ఆధిపత్య ప్రాంతాలను వారి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా “కోర్ జీహెచ్ఎంసీలో విలీనం చేసిందని, నగర పరిపాలనను సమర్థవంతంగా తాకట్టు పెట్టిందని రెడ్డి ఆరోపించారు.
More Stories
దృష్టి లోపం ఉన్నవారి కోసం ఏఐ స్మార్ట్ గ్లాసెస్
రాహుల్ గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
ఎన్నికల ముందు రూ 9.12 లక్షల కోట్లతో యూపీ బడ్జెట్