పార్లమెంటులో ప్ర‌ధాని మోదీ సీటు వ‌ద్ద ఏం జరిగింది?

పార్లమెంటులో ప్ర‌ధాని మోదీ సీటు వ‌ద్ద ఏం జరిగింది?

* విప‌క్ష ఎంపీల‌పై చ‌ర్య‌లు కోరిన బీజేపీ మ‌హిళా ఎంపీలు

లోక్‌స‌భ‌లో ఫిబ్ర‌వ‌రి 4వ తేదీన ప్ర‌ధాని మోదీ కూర్చునే సీటు వ‌ద్ద విప‌క్ష మ‌హిళా ఎంపీలు ఆందోళ‌న చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఆ ఘ‌ట‌న‌కు చెందిన వీడియోను కేంద్ర ప్ర‌భుత్వం మంగళవారం విడుదల చేసింది. విప‌క్ష మ‌హిళా స‌భ్యులు బ్యాన‌ర్లు ప‌ట్టుకుని మోదీ కూర్చుకునే సీటు వ‌ద్ద నినాదాలు చేశారు.  రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై మాట్లాడేందుకు ఆ స‌మ‌యంలో ప్ర‌ధాని మోదీ అక్క‌డ‌కు రావాల్సి ఉన్న‌ది. కానీ విప‌క్ష మ‌హిళా ఎంపీల నిర‌స‌న వ‌ల్ల‌ ఆయ‌న రాలేక‌పోయారు.

ఆ త‌ర్వాత ప్ర‌ధాని ప్ర‌సంగం చేయ‌కుండానే తీర్మానాన్ని ఆమోదించిన‌ట్లు లోక్‌స‌భ ప్ర‌క‌టించింది. పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు ఆ రోజున జ‌రిగిన ఘ‌ట‌న‌కు చెందిన వీడియోను త‌న ఎక్స్ అకౌంట్‌లో పోస్టు చేశారు. కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమ‌ణి నేతృత్వంలో కొంద‌రు మ‌హిళా ఎంపీలు మోదీ సీటు వ‌ద్ద ఆందోళ‌న చేప‌ట్టారు. ప్ర‌ధాని మోదీ వెళ్లే మార్గంలో నిలుచుని నినాదాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ త‌మ ఎంపీల దిగ‌జారుడు ప్ర‌వ‌ర్త‌న ప‌ట్ల గ‌ర్వంగా ఫీల‌వుతుంద‌ని మంత్రి రిజిజు త‌న ట్వీట్‌లో ఆరోపించారు. త‌మ పార్టీ హుందాగా వ్య‌వ‌హ‌రించి, పార్ల‌మెంట్ గౌర‌వాన్ని, ప‌విత్ర‌త‌ను కాపాడిన‌ట్లు మంత్రి చెప్పారు. మరోవంక, ప్ర‌ధానిని అడ్డుకున్న మ‌హిళా విప‌క్ష ఎంపీల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఇవాళ బీజేపీ మ‌హిళా ఎంపీలు స్పీక‌ర్‌ను కోరుతూ లేఖ రాశారు. ఆ మేరకు స్పీక‌ర్ ఓం బిర్లాకు బీజేపీ మ‌హిళా ఎంపీలు లేఖ రాశారు. 

సోమ‌వారం ఇదే త‌ర‌హాలో విప‌క్ష ఎంపీలు స్పీక‌ర్ బిర్లాకు లేఖ రాశారు. అన్యాయంగా త‌మను ఆరోపిస్తున్న‌ట్లు ఆ లేఖ‌లో మ‌హిళా ఎంపీలు ఆరోపించారు. రూల్స్ ప్ర‌కారం ఆ ప్ర‌తిప‌క్ష ఎంపీల‌పై క‌ఠిన నిర్ణ‌యం తీసుకోవాల‌ని బీజేపీ ఎంపీలు త‌మ లేఖ‌లో కోరారు. ప్రజాస్వామ్య వ్య‌వ‌స్థ‌ల‌ను అగౌర‌వ‌ప‌రిచిన‌ట్లు ఆరోపించారు.  రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై చ‌ర్చ‌ను నిర్వ‌హించిన తీరుపై స్పీక‌ర్ బిర్లాను బీజేపీ మ‌హిళా ఎంపీలు ప్ర‌శంసించారు.

స‌భా మ‌ర్యాద‌ను, హుందాత‌నాన్ని కాపాడిన‌ట్లు పేర్కొన్నారు. ఆ రోజున లోక్‌స‌భ ఛాంబ‌ర్‌లో జ‌రిగిన ఆ దుర‌దృష్ట‌క‌ర స‌న్నివేశాన్ని యావ‌త్ దేశం వీక్షించింద‌ని పేర్కొన్నారు.  విప‌క్ష పార్టీ ఎంపీలు హౌజ్ వెల్‌లోకి దూసుకెళ్ల‌డ‌మే కాకుండా స్పీక‌ర్ టేబుల్‌పై ఎక్కే ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు లేఖ‌లో ఆరోపించారు. పేప‌ర్ల‌ను చింపేసి, స్పీక‌ర్‌పై విసిరేశార‌ని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొంద‌రు మ‌హిళా స‌భ్యులు దురుసుగా ప్ర‌వ‌ర్తించార‌ని, బ్యాన‌ర్లు, ప్ల‌కార్డులు ప‌ట్టుకుని మంత్రులు ఉన్న బెంచీల వైపు వెళ్లిన‌ట్లు లేఖ‌లో పేర్కొన్నారు. ప్ర‌ధాని సీటును సీజ్ చేయ‌డ‌మే కాకుండా సీనియ‌ర్ మంత్రులు ఉండే ట్రెజ‌రీ బెంచ్‌ల‌ను కూడా ఆ ఎంపీలు ఆక్ర‌మించిన‌ట్లు లేఖ‌లో ఆరోపించారు.