ది న్యూస్ ఇంటర్నేషనల్ పత్రిక కథనం ప్రకారం 2025 లేబర్ ఫోర్స్ సర్వే భయంకరమైన వాస్తవాలను బయటపెట్టింది. దేశంలో నిరుద్యోగిత రేటు 7.1 శాతానికి పెరిగింది. ఇది గడిచిన 21 ఏళ్లలో అత్యధికం. ఈ గణాంకాలు ప్రభుత్వ విజయవాదానికి కళ్లెం వేస్తున్నప్పటికీ, అధికారిక ప్రకటనల్లో దీని ప్రస్తావనే లేకుండా పోయింది.
ఉద్యోగాలు దొరక్క ప్రజలు పడుతున్న ఇబ్బందులు, నిత్యావసరాలు తగ్గించుకుంటున్న కుటుంబాలు, అవకాశాల్లేక ఆశలు కోల్పోతున్న యువత రూపంలో ఈ సంక్షోభం ప్రతిరోజూ కనిపిస్తూనే ఉన్నది. ఈ మీడియా కథనం నేపథ్యంలో ‘పాకిస్థాన్ రాబోయే పదేళ్లలో ఏకంగా 3 కోట్ల ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంటుంది’ అని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా చేసిన హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది.
ఏటా దాదాపు 30 లక్షల మంది యువత ఉద్యోగ మార్కెట్లోకి ప్రవేశిస్తున్న తరుణంలో వారికి ఉపాధి కల్పించడం ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది. ఈ సంక్షోభానికి నిదర్శనంగా 2025లో రికార్డు స్థాయిలో దాదాపు 4,000 మంది డాక్టర్లు దేశం విడిచి వెళ్లిపోయారు.
వృత్తిపరమైన గౌరవం, ఆర్థిక భద్రత లేకపోవడమే ఇందుకు కారణం. ఉద్యోగాల కల్పన కోసం ప్రైవేటు రంగంపై ఆధారపడటం కూడా సమస్యను జఠిలం చేస్తోంది. ఫ్యాక్టరీలు మూతపడుతుండటం, తయారీదారులు విదేశాలకు తరలిపోతుండటంతో ఆ రంగం కూడా తీవ్ర ఒత్తిడిలో ఉంది. కేవలం లెక్కల్లో స్థిరత్వం చూపిస్తూ, క్షేత్రస్థాయిలో ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతింటే ఆ స్థిరత్వం వల్ల ప్రయోజనం ఏమిటని సదరు కథనం ప్రశ్నించింది.

More Stories
ఎప్స్టీన్ ఫైల్స్‌తో బ్రిటన్ ప్రధానికి గండం… తొలి ముస్లిం ప్రధాని?
భారత్ తో క్రికెట్ బహిష్కరణపై పాక్ వెనకడుగు
సొంత డిఎన్ఎతో కొత్త మానవజాతి సృష్టించే యత్నం