ఆలయ ఉత్సవంలో తొక్కిసలాట.. మహిళ మృతి

ఆలయ ఉత్సవంలో తొక్కిసలాట.. మహిళ మృతి

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లా దాబ్రా పట్టణంలో మంగళవారంనాడు విషాద ఘటన చోటుచేసుకుంది. నవగ్రహ ఆలయం ప్రారంభోత్సవానికి బయలుదేరిన కలశ యాత్రలో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుని 70 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో ఏడుగురు మహిళలు గాయపడ్డారు. వీరిలో ఒక మైనర్ బాలిక ఉంది. గాయపడిన నలుగురిని చికిత్స కొసం గ్వాలియర్‌కు తరలించగా, మరో ముగ్గురికి దాబ్రాలో చికిత్స అందిస్తున్నారు.

గ్వాలియర్ కలెక్టర్ రుచికా చౌహాన్ మాట్లాడుతూ, కలశ యాత్ర కోసం ఉదయం డాబ్రా స్టేడియం సమీపంలో పెద్ద సంఖ్యలో మహిళలు గుమిగూడారని చెప్పారు. కలశ (పవిత్ర కుండలు) పంపిణీ చేస్తున్న సమయంలో గందరగోళం చెలరేగిందని, జనంలో ఘర్షణ చెలరేగిందని ఆమె తెలిపారు. “ఆ రద్దీలో, 70 ఏళ్ల వృద్ధురాలు నుజ్జునుజ్జు అయి, తరువాత ఆమె గాయాలతో మరణించింది” అని కలెక్టర్ చెప్పారు.

గాయపడిన వారిలో ఆరుగురు మహిళలు, ఒక మైనర్ బాలిక ఉన్నారు. గాయపడిన వారిలో ముగ్గురు గ్వాలియర్‌లో చికిత్స పొందుతున్నారని, మరో నలుగురు డబ్రాలో చికిత్స పొందుతున్నారని చౌహాన్ చెప్పారు.  పరిస్థితిని వెంటనే అదుపులోకి తెచ్చామని, కలశ యాత్ర ముందుగు సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని వివరించారు.

కలశ పంపిణీ సమయంలో చాలా మంది మహిళలు ఒకేసారి ముందుకు దూసుకెళ్లారని, తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడిందని గ్వాలియర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ అరవింద్ సక్సేనా తెలిపారు. “ఈ సంఘటనలో ఒక మహిళ నుజ్జునుజ్జు అయి మరణించింది” అని ఆయన పేర్కొన్నారు.   పెద్ద ఎత్తున మహిళలు తోసుకురావడంతో పరిస్థితి అదుపుతప్పినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటన అనంతరం కలశయాత్ర ముందుగా నిర్దేశించిన మార్గాల్లో బయలుదేరి నవగ్రహ ఆలాయనికి చేరుకున్నట్టు జిల్లా యంత్రాంగం తెలిపింది.